Share News

ఉద్యోగాలకు సొంతంగా ఎసరు!

ABN , Publish Date - May 23 , 2026 | 06:06 AM

ఉద్యోగాల కోసం యువత ఓ వైపు నానా పాట్లు పడుతోంది. హైదరాబాద్‌, బెంగళూరు లాంటి నగరాల్లో కోచింగ్‌లు తీసుకుంటూ కంపెనీల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

ఉద్యోగాలకు  సొంతంగా ఎసరు!

  • బీటెక్‌పై మోజుతో వచ్చిన జాబ్‌లు వదులుకుంటున్న డిప్లొమా విద్యార్థులు

  • కోర్సు పూర్తి తర్వాత 51.5 శాతం మంది ఈసెట్‌ ద్వారా ఇంజనీరింగ్‌కు..

  • 43 శాతం మంది మాత్రమే ఉద్యోగాల్లోకి..

  • బీటెక్‌ తర్వాత జాబ్‌లు రాక ఇబ్బందులు

  • డిప్లొమా స్థాయిలో ఉద్యోగార్థులకు భారీ డిమాండ్‌

  • ఫెయిలైనా తీసుకుంటున్న కొన్ని కంపెనీలు

  • విద్యాశాఖ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు

‘ఇద్దరు విద్యార్థులు ఒకే పాలిటెక్నిక్‌ కాలేజీలో డిప్లొమా పూర్తిచేశారు. ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. వారిలో ఒకరు ఉద్యోగంలో చేరితే, మరొకరు వచ్చిన ఉద్యోగం వద్దకునుకుని.. ఉన్నత విద్య కోసం ఇంజనీరింగ్‌లో చేరారు. ఇప్పుడు అతనికి ఇంజనీరింగ్‌ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదు’. ఇలా డిప్లొమా స్థాయిలోనే ఉద్యోగాలు వస్తున్నా.. ఇంకా ఉన్నత ఉద్యోగాలు చేయాలనే ఆశతో వచ్చిన జాబ్‌ను వదులుకుంటున్న వారి సంఖ్య రాష్ట్రంలో వేలల్లో ఉంది. బీటెక్‌ చేసిన తర్వాత ఉద్యోగాల్లేక వారంతా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అటు బీటెక్‌తో ఉద్యోగాలు రాక, ఇటు డిప్లొమాతో వచ్చిన ఉద్యోగాలు వద్దనుకుని ఎటూ కాకుండా పోయే పరిస్థితి ఏర్పడుతోంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఉద్యోగాల కోసం యువత ఓ వైపు నానా పాట్లు పడుతోంది. హైదరాబాద్‌, బెంగళూరు లాంటి నగరాల్లో కోచింగ్‌లు తీసుకుంటూ కంపెనీల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని అయితే ఏఐ మరింతగా కుదిపేస్తోంది. మరోవైపు డిప్లొమా కోర్సులు చేస్తున్న వారి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పదో తరగతి అనంతరం మూడేళ్ల డిప్లొమా కోర్సులో చేరి ఫైనలియర్‌లో ఉండగానే.. కంపెనీలు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి మరీ ఉద్యోగాలు ఇస్తున్నాయి. డిప్లొమా కోర్సులు చేస్తున్న వారిలో చాలా వరకు క్యాంపస్‌ స్థాయిలోనే ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. అయితే సూపర్‌వైజింగ్‌ స్థాయి ఉద్యోగాలు తమకొద్దని, తాము బీటెక్‌లోనే చేరతామంటూ చాలా మంది ఇంజనీరింగ్‌కు వెళ్లిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ ఉద్యోగాల్లేక చాలా మంది డిప్లొమా స్థాయి ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు. దీనిపై ఉన్నత విద్యా శాఖ (సాంకేతిక) ఇటీవల చేసిన ఓ అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు, 8 పెద్ద ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో చదివిన విద్యార్థులపై వేర్వేరుగా అధ్యయనం చేశారు. 2025లో డిప్లొమా ఉత్తీర్ణులైన వారి స్థితిని విశ్లేషించారు.


ఎనిమిది కాలేజీల్లో ఇలా..

రాష్ట్రంలోని పెందుర్తి, కాకినాడ, అనంతపురం, అనకాపల్లి, విజయవాడ, శ్రీకాకుళం, నంద్యాల, గుంటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో చదివి 2025లో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులపై విడిగా అధ్యయనం చేశారు. ఈ ఎనిమిది కాలేజీల్లో 2174 మందిని క్యాంపస్‌ స్థాయిలోనే ఉద్యోగాలకు కంపెనీలు ఎంపిక చేసుకున్నాయి. అయితే ఫైనల్‌ ఇయర్‌ ఫలితాల్లో 467 మంది ఫెయిలయ్యారు. ఉత్తీర్ణులైన 1707 మందికి ఉద్యోగాలు వచ్చినప్పటికీ.. 1343 మంది ఈసెట్‌ రాసి బీటెక్‌లో చేరారు. 364 (21.32 శాతం) మంది మాత్రమే డిప్లొమా ఆధారంగా ఉద్యోగాలో చేరారు.

బీటెక్‌ వయా డిప్లొమా

డిప్లొమాలో చేరుతున్న వారిలో ప్రధానంగా రెండు రకాల విద్యార్థులు ఉంటారు. కోర్సు పూర్తిచేసి త్వరగా ఉద్యోగం పొందాలనే లక్ష్యంతో వచ్చేవారు కొందరైతే.. డిప్లొమా తర్వాత వెంటనే ఈసెట్‌ రాసి ఇంజనీరింగ్‌లో చేరడమే లక్ష్యంగా వస్తున్నవారు కొందరున్నారు. డిప్లొమా చేసిన వారు ఈసెట్‌ రాసి లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌ రెండో సంవత్సరంలో చేరొచ్చు. ఇలా చేరిన వారికి డిప్లొమా మూడేళ్లు, ఇంజనీరింగ్‌ మూడేళ్లు మొత్తం ఆరేళ్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుంది. మరోవైపు ఈసెట్‌ ద్వారా వెళ్లే విద్యార్థులకు దాదాపుగా బీటెక్‌ సీట్లు కోరుకున్న విధంగా వస్తాయి. ఇలా వెంటనే బీటెక్‌లో చేరాలనే తోటి విద్యార్థులను చూసి డిప్లొమా ఆధారంగా ఉద్యోగాలు చేయాలని భావించిన వారు కూడా మనసు మార్చుకుని ఇంజనీరింగ్‌కు వెళ్తున్నారు.


ఉద్యోగం వచ్చినా వద్దనుకొని..

9145 మందిలో డీసీసీపీ బ్రాంచ్‌ విద్యార్థులు, ఫెయిలైన వారు మినహా దాదాపుగా అందరికీ క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లోనే ఉద్యోగాలు వచ్చాయి. 8417 మందిని క్యాంపస్‌ స్థాయిలో ప్లేస్‌మెంట్‌లు కల్పించేందుకు మ్యాపింగ్‌ చేశారు. కానీ వారిలో 4709 మంది ఇంజనీరింగ్‌కు వెళ్లిపోయారు. 3904 (42.7 శాతం) మాత్రమే ఉద్యోగాల్లో చేరారు. క్యాంపస్‌లోనే ఉద్యోగాలు వచ్చినా చాలా మంది వాటిని వదిలేసి బీటెక్‌లో చేరారు.

డిప్లొమా ఫెయిలైనా ఉద్యోగానికి ఒకే

రాష్ట్రంలో డిప్లొమా పూర్తి చేసిన యువతకు ఉద్యోగావకాశాలు భారీగా ఉన్నాయి. పరిశ్రమలు డిప్లొమా విద్యార్థులను ఫైనలియర్‌ స్థాయిలోనే ఎంపిక చేసుకుంటున్నాయి. నెలకు రూ.15 వేల నుంచి రూ.65 వేల జీతంతో ఉద్యోగాలు లభిస్తున్నా విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. పరిశ్రమల్లో ప్రతి ఎనిమిది మంది ఐటీఐ ఉద్యోగులకు నలుగురు డిప్లొమా ఉద్యోగులు సూపర్‌వైజర్లుగా అవసరం. ప్రస్తుత ట్రెండ్‌లో అటు ఐటీఐ చదివిన వారు, ఇటు ఇంజనీరింగ్‌ చదివిన వారు అందుబాటులో ఉన్నా.. మధ్యలో డిప్లొమా స్థాయి ఉద్యోగులు మాత్రం దొరకడం లేదు. ఎందుకంటే వారంతా డిప్లొమా అనంతరం ఉద్యోగాలకు వెళ్లకుండా బీటెక్‌లో చేరుతున్నారు. ఫలితంగా డిప్లొమాలో ఒకట్రెండు సబ్జెక్టులు ఫెయిలైనా... అప్పటికే క్యాంపస్‌లో ఇంటర్వ్యూలకు ఎంపికై ఉంటే కంపెనీలు వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి.


కొందరికి 9.02 లక్షల ప్యాకేజీ

2024-25లో డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన విద్యార్థుల్లో పలువురికి భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు వచ్చాయి. వి.వంశీకృష్ణ, ఎం.పూర్ణిమ, కె.నాగ దుర్గ, జి.సిద్దు, జి.సుధీర్‌కుమార్‌, కె.సాయి శృతి, ఆర్‌.అనూష ఏడాదికి రూ.9.02 లక్షల ప్యాకేజీతో జాబ్‌లు సాధించారు. 12 మందికి రూ.8 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు రాగా.. మరో 12 మంది కూడా మంచి ప్యాకేజీలు లభించాయి.

బీటెక్‌కే ఎక్కువ మొగ్గు

2025లో 9145 విద్యార్థులు ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌లలో ఫైనలియర్‌ చదివారు. వారిలో 4709 (51.5 శాతం) మంది ఈసెట్‌ రాసి బీటెక్‌ రెండో సంవత్సరంలో చేరారు. 4436 (48.5 శాతం) మంది బీటెక్‌ వైపు వెళ్లలేదు. వీరిలో డిప్లొమా ఆధారంగా ఉద్యోగాలు పొందిన వారు, కోర్సు పూర్తి చేయలేకపోయినవారు(ఫెయిల్‌), అటు ఉద్యోగం ఇటు ఉన్నత విద్యకు వెళ్లకుండా డ్రాప్‌ అయినవారు ఉన్నారు. మరోవైపు ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో చదివిన విద్యార్థులు చాలా మంది బీటెక్‌కు వెళ్లిపోయారు.

Updated Date - May 23 , 2026 | 06:07 AM