‘విద్యార్థి మిత్ర’ కిట్ల పంపిణీ ఆలస్యం
ABN , Publish Date - May 24 , 2026 | 04:52 AM
ఈ ఏడాది పాఠశాలలను పునఃప్రారంభించే నాటికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్లు అందే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రతి సంవత్సరం పాఠశాలల..
పశ్చిమాసియా యుద్ధ ప్రతికూల పరిస్థితులే కారణం: సమగ్ర శిక్షా పీడీ
అమరావతి, మే 23 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది పాఠశాలలను పునఃప్రారంభించే నాటికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్లు అందే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రతి సంవత్సరం పాఠశాలల పునఃప్రారంభం నాటికే విద్యార్థి మిత్ర కిట్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని నెలలుగా పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాలతో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల వల్ల ఈ ఏడాది విద్యార్థి కిట్ల పంపిణీ నెల రోజులు ఆలస్యం కానుందని సమగ్ర శిక్షా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు తెలిపారు. జూన్ 12న పాఠశాలలను తెరిచే నాటికి విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలను పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, మిగిలిన స్కూలు బ్యాగు, షూ, యూనిఫాంలను మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ (మెగా పీటీఎం) నాటికి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ మేరకు సీనియర్ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో తయారీదారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తోందని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.