పెనుగాలుల బీభత్సం
ABN , Publish Date - May 30 , 2026 | 05:23 AM
కృష్ణా, బాపట్ల, ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో గురువారం రాత్రి పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. వర్షంతోపాటు..
తాటిచెట్టు పడి ఇద్దరు దుర్మరణం.. విద్యుదాఘాతంతో యువతి మృతి
కృష్ణా, బాపట్లలో ఉద్యాన పంటలకు భారీ నష్టం
మచిలీపట్నం, ఏలూరు సిటీ, కొల్లూరు, కరప, ఒంగోలు, మే 29 (ఆంధ్రజ్యోతి): కృష్ణా, బాపట్ల, ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో గురువారం రాత్రి పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. వర్షంతోపాటు.. బలమైన గాలులకు తాటి, కొబ్బరి, భారీ వృక్షాలు నేలకొరిగాయి. పలుచోట్లస్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉద్యాన పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. కృష్ణా జిల్లా కోడూరు మండలం కుమ్మరిపాలేనికి చెందిన గరికపాటి మనోహర్‌బాబు (29), చుట్టూరు శివరామకృష్ణ (26) గురువారం రాత్రి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతుండగా తాటి చెట్టుపడి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. పమిడిముక్కల మండలం లంకపల్లికి చెందిన ముళ్లపూడి అంకిత(17) శుక్రవారం ఉదయం తెగిపడి ఉన్న విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఏలూరు జిల్లా దెందులూరు మండలం సీతంపేటలో తుమ్మల జోస్‌ఫకు చెందిన పశువుల పాకపై పిడుగు పడడంతో గేదె, దూడ మృతి చెందాయి. బాపట్ల జిల్లాలోని లంక గ్రామాల్లో గురువారం రాత్రి అరగంట పాటు వీచిన తీవ్ర గాలులకు అరటి, బొప్పాయి, తమలపాకు వంటి ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లో గీత గీసి ఆరబెట్టిన పచ్చి ఇటుకలు వర్షార్పణం కావడంతో నష్టపోయామని పరిశ్రమదారులు వాపోతున్నారు. కాగా, కాకినాడ జిల్లా కరప మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఉదయం వడగళ్ల వాన కురిసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ట్రాన్స్‌ఫార్మర్‌లు దెబ్బతిన్నాయి. ఒంగోలు, ఇతర పట్టణాలతోపాటు వందలాది గ్రామాల్లో అంధకారం నెలకొంది. త్రిపురాంతకం మండలం పాత అన్నసముద్రంలో ఈదురుగాలుల తీవ్రతకు 15 ఇళ్లు దెబ్బతిన్నాయి. కనిగిరి ప్రాంతంలో పొగాకు బ్యారన్లు కూలిపోవడంతో పాటు షెడ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి.