‘ఎబోలా’పై అప్రమత్తం
ABN , Publish Date - May 25 , 2026 | 05:24 AM
ఆఫ్రికాలో ఎబోలా వైరస్ కలకలం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల నుంచి విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాలకు..
విమానాశ్రయాలు, పోర్టుల్లో నిర్ధారణ పరీక్షలు: మంత్రి సత్యకుమార్
అమరావతి, మే 24(ఆంధ్రజ్యోతి): ఆఫ్రికాలో ఎబోలా వైరస్ కలకలం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల నుంచి విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాలకు చేరుకొనే ప్రయాణికులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయంలో ఎయిర్‌పోర్ట్ ఆథారిటీ, జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించేలా చర్యలు తీసుకుంటారని ఆరోగ్యమంత్రి సత్యకుమార్ ఆదివారం వెల్లడించారు. అలాగే విశాఖ పోర్టు అధికారులతో మాట్లాడి, ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామని చెప్పారు. రోడ్డు మార్గాల ద్వారా వచ్చే వారిపైనా దృష్టి సారించాలని సూచించారు. కొవిడ్ నాటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎబోలా విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అత్యవసర పరిస్థితులు తలెత్తితే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న నగరాల్లోని బోధనాస్పత్రుల్లో 15 పడకలతో ప్రత్యేకంగా ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నామని.. వైరస్ నిర్ధారణ పరీక్షల కిట్లు తక్షణ అవసరాలకు సరిపడా ఉన్నాయని తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వైరస్ వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు.