స్టీల్ హబ్‌గా ఏపీ
ABN , Publish Date - May 06 , 2026 | 06:19 AM
మన రాష్ట్రంలో భారీగా ఇనుప ఖనిజం నిల్వలు ఉన్నట్లు గనుల శాఖ నిర్ధారించింది. రాష్ట్రాన్ని స్టీల్ హబ్‌గా మార్చేలా 17 బ్లాక్‌ల పరిధిలో 2.40 లక్షల కోట్ల విలువైన 2,700 మిలియన్ టన్నుల నిల్వలున్నట్లు స్పష్టం చేసింది.
రాష్ట్రంలో భారీగా ముడి ఇనుప ఖనిజం నిల్వలు
17 బ్లాక్‌ల్లో 2,700 మిలియన్ టన్నులు
దాని విలువ రూ. 2.40 లక్షల కోట్లకు పైనే
మైనింగ్ మొదలైతే ఏటా 110 టన్నుల ఉత్పత్తి
1.90 లక్షల కోట్ల పెట్టుబడులకు చాన్స్
1.50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
గనుల శాఖపై సమీక్షలో సీఎంకు నివేదిక
అమరావతి, మే 5 (ఆంధ్రజ్యోతి): మన రాష్ట్రంలో భారీగా ఇనుప ఖనిజం నిల్వలు ఉన్నట్లు గనుల శాఖ నిర్ధారించింది. రాష్ట్రాన్ని స్టీల్ హబ్‌గా మార్చేలా 17 బ్లాక్‌ల పరిధిలో 2.40 లక్షల కోట్ల విలువైన 2,700 మిలియన్ టన్నుల నిల్వలున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సందర్భంగా కీలక నివేదికను సమర్పించింది. ఓబుళాపురం, మించేరి, గుటుపల్లి, వె ల్దుర్తి, కొణిజేడు, లక్ష్మక్కపల్లె (2 బ్లాక్‌లు), అద్దంకివారిపాలెం, వాడేపల్లి, లేటపల్లె, నాగయ్యపల్లె, పగడాలపల్లె, మిన్నయ్యగారిపల్లె, లక్కంవాండ్లపల్లె, శివపురం, సడుకొండ, ఎర్రకొండ ప్రాంతాల్లో ఐరన్‌ఓర్ బ్లాక్‌లను గుర్తించారు. ఇందులో కొణిజేడులో 1307 హెక్టార్లలో ఉన్న ఐరన్‌ఓర్ ఏపీఎండీసీ లీజులో ఉంది. లక్ష్మక్కపల్లెలోని రెండు బ్లాక్‌లు, అద్దంకివారిపాలెంలోని ఒక బ్లాక్ జేఎ్‌సడబ్ల్యూ కంపెనీ లీజులో ఉంది. వాడేపల్లె-535హెక్టార్లు, లేటపల్లె-1,000 హెక్టార్లు, నాగయ్యపల్లె-239 హెక్టార్లు, పగడాలపల్లె-227 హెక్టార్లు, లక్కంవాండ్లపల్లె 300 హెక్టార్లలో ఉన్న ఐరన్‌ఓర్ లీజులు ఇంకా ఎవ్వరికీ కేటాయించలేదు. ఇందులో ఓబుళాపురంలో 190 హెక్టార్లలో ఉన్న లీజులు వివాదంలో ఉన్నాయి. మొత్తంగా 13 వేల హెక్టార్ల పరిధిలో ఇనుప ఖనిజం నిక్షేపాలున్నట్లు గనులశాఖ స్పష్టత ఇచ్చింది. అన్ని చోట్ల మైనింగ్ మొదలైతే ఏటా కనీసం 110 మెట్రిక్ టన్నుల మేర ఇనుప ఖనిజం బయటకు తీయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అయితే, ఇందులో 80 శాతం బ్లాక్‌లు రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్నాయి. ఇక్కడ మైనింగ్ చేయాలంటే, ఆ మేరకు సమానమైన భూమిని అటవీశాఖకు కేటాయించాల్సి ఉంది. ఈ విషయంలో విధాన నిర్ణయాలు తీసుకోవాలని గనులశాఖ కోరింది. గుర్తించిన 17 బ్లాక్‌ల్లో మైనింగ్ మొదలయితే రాష్ట్రంలో కనీసం రూ. 1.90 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 1.50 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని నివేదించారు.
మరిన్ని నిక్షేపాలను గుర్తించండి
ఇప్పటికే గుర్తించిన బ్లాక్‌ల లీజుల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రాన్ని స్టీల్‌హబ్‌గా తీర్చిదిద్దేందుకు ముడి ఇనుప ఖనిజం మైనింగ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అరుదైన ఖనిజాల మిషన్ ఏర్పాటుపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. కాగా, బెరైటీస్ ఎగుమతులపై కేంద్రం ఇటీవలి కాలంలో విధించిన నియంత్రణ, నిషేఽధం వల్ల ఆదాయం తగ్గుతుందని, రాష్ట్రంలో చిన్న కంపెనీలపై తీవ్ర ప్రభావం పడి కార్మికులకు ఉపాధి లేకుండా పోతోందని అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కేంద్రంతో చర్చిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కాగా, గనుల శాఖ ఆదాయం 2025-26లో కొంత పెరిగింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 3,416 కోట్లకు ఆదాయం చేరింది. ఈ నేపథ్యంలో 2026-27 సంవత్సరానికి రూ. 4,650 కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. సమావేశంలో ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.