రాష్ట్రమంతా స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్
ABN , Publish Date - Jun 15 , 2026 | 03:59 AM
రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఎల్‌ఈడీ వెలుగులు నింపే భారీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
పట్టణాల్లో 10.5 లక్షల వీధి దీపాలు
‘స్ట్రీట్ లైటింగ్ నేషనల్ ప్రోగ్రామ్’లో భాగంగా ఏర్పాటు.. దేశంలోనే పెద్ద ప్రాజెక్టు
అంతటా ఎల్‌ఈడీ వెలుగులతో 30 శాతం విద్యుత్ ఆదా
అమరావతి, జూన్ 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఎల్‌ఈడీ వెలుగులు నింపే భారీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) భాగస్వామ్యంతో రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో (యూఎల్‌బీఎస్) ఐఓటీ ఆధారిత ‘ఇంటిగ్రేటెడ్ లైటింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ (ఐఎల్‌ఎంఎస్) స్మార్ట్ వీధి దీపాల ప్రాజెక్టును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ‘స్ట్రీట్ లైటింగ్ నేషనల్ ప్రోగ్రామ్’లో భాగంగా అమలుచేస్తున్న ఈ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద స్మార్ట్ వీధి దీపాల ప్రాజెక్టుగా నిలవనుంది. ఈ ప్రాజెక్టును ఆరు నెలల్లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు, కనీసం 30శాతం విద్యుత్ ఆదా అవుతుంది. సాధారణ వీధి దీపాలు వాట్‌కు 100 ల్యూమెన్స్ సామర్థ్యాన్ని ఇస్తే, ఈ కొత్త ఎల్‌ఈడీ దీపాలు వాట్‌కు 150 ల్యూమెన్స్ సామర్థ్యంతో మెరుగైన వెలుతురు ఇచ్చి, విద్యుత్‌ను ఆదా చేస్తాయి. ఈ స్ట్రీట్ లైటింగ్ ప్రోగ్రామ్ ద్వారా దేశవ్యాప్తంగా ఏటా రూ.5,400 కోట్లు ఆదా జరుగుతుంది. ఈ ప్రాజెక్టు అమలులో భాగంగా రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 10.5 లక్షల వీధి దీపాలు ఏర్పాటు చేస్తారు. కొత్త విధానంలో స్మార్ట్ మానిటరింగ్‌కి అవకాశం ఉంది. ప్రతి స్తంభాన్ని విడిగా నియంత్రించవచ్చు. ఎక్కడైనా వీధి దీపం వెలగకపోయినా క్షణాల్లో గుర్తించి, రియల్ టైమ్‌లో సరిచేయవచ్చు.