అనుమతులకు సింగిల్ పోర్టల్
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:54 AM
‘కిరాణా షాప్ నుంచి డేటా సెంటర్ దాకా సింగిల్ పోర్టల్‌లోనే అనుమతులు ఇవ్వాలి. ఇకపై ప్రతి పెలా ప్రధాన ప్రాజెక్టులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు ఉండాల్సిందే’ అని మంత్రి లోకేశ్, అధికారులకు స్పష్టం చేశారు.
ప్రతినెలా ప్రధాన ప్రాజెక్టుల భూమి పూజ, ప్రారంభోత్సవాలు
20 లక్షల మంది యువతకు ఉద్యోగ కల్పన
మంత్రుల బృందంతో కలసి లోకేశ్ సమీక్ష
అమరావతి, జూన్ 23(ఆంధ్రజ్యోతి): ‘కిరాణా షాప్ నుంచి డేటా సెంటర్ దాకా సింగిల్ పోర్టల్‌లోనే అనుమతులు ఇవ్వాలి. ఇకపై ప్రతి పెలా ప్రధాన ప్రాజెక్టులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు ఉండాల్సిందే’ అని మంత్రి లోకేశ్, అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేశ్, టీజీ భరత్(వర్చువల్ విధానంలో హాజరయ్యారు)తో కలసి, వివిధ శాఖల కార్యదర్శులతో మంత్రి లోకేశ్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల హామీలో భాగంగా 20 లక్షల ఉద్యోగాలను యువతకు ఇచ్చేలా కార్యాచరణను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన 750 భారీ పరిశ్రమల పనులు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రుల బృందానికి అధికారులు వివరించారు. ఇవి పూర్తిస్థాయిలో పట్టాలెక్కితే పెద్దఎత్తున రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు దక్కుతాయని అధికారులు వివరించారు. ప్రతినెలా పరిశ్రమల స్థాపనకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు ఉంటే.. ప్రభుత్వం ప్రగతి దిశగా నడుస్తోందన్న విశ్వాసం ప్రజల్లో కలుగుతుందని మంత్రులు బృందం అభిప్రాయం వ్యక్తం చేసింది. లోకేశ్ మాట్లాడుతూ... ‘పరిశ్రమలు ఆకర్షించేలా విదేశాల్లోనూ, దేశంలోనూ పెద్దఎత్తున రోడ్‌షోలను నిర్వహించాలి. పరిశ్రమలు గ్రౌండ్ కావడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలి. గత నెల రోజుల వ్యవధిలో 210 భారీ పరిశ్రమల రాష్ట్రంలో పెట్టుబడికి ముందుకు వచ్చాయి. ప్రాజెక్టుల ప్రగతికి సంబంధించి అధికారులు సమన్వయంతో పనిచేయాలి. రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వివిధ నిర్మాణ దశల్లో ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలు ఉత్పత్తిని ప్రారంభించేలా చర్యలు చేపట్టాలి. ఎంఎ్‌సఎంఈలను కూడా ఆన్‌బోర్డు చేయాలి.
భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోనికి రానున్న నేపథ్యంలో హోటల్ రూమ్‌లు అందుబాటులో ఉండేలా పర్యాటక శాఖ చర్యలు చేపట్టాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో భాగంగా స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ప్రభుత్వ విధానాలుగా ఉండాలి. రాష్ట్రంలో గార్మెంట్ పరిశ్రమను ఆకర్షించేందుకు చర్యలు తీసుకోవాలి. ఉద్యోగాలతో అనుసంధానం చేసేలా పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందించాలి. టెక్స్‌టైల్ క్యాప్టివ్ పవర్ ఉత్పత్తికి ప్రోత్సహించాలి. అనకాపల్లి, విశాఖ స్టీల్‌సిటీలుగా మారుతున్నాయి. ఉక్కు పరిశ్రమకు ప్రధానమైన ముడిసరుకు నిరంతరాయంగా అందేలా కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలి’ అని మంత్రి లోకేశ్ ఆదేశించారు. సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్, పంచాయతీరాజ్ రూరల్ డెవల్‌పమెంట్ కార్యదర్శి కాంతిలాల్ దండే, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ , ఎకనామిక్ డెవల్‌పమెంట్ బోర్డు సీఓఓ మన్మోహన్, స్కిల్ డెవల్‌పమెంట్ ఎండీ గణేశ్ కుమార్, ఏపీఐఐసీ ఎండీ దినేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
5 నుంచి లోకేశ్ కొరియా పర్యటన
మంత్రి లోకేశ్ జూలై 5 నుంచి 11 వరకు రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో పర్యటించనున్నారు. కొరియా ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కొరియా ప్రభుత్వ శాఖల మంత్రులు, అధికారులతోను, కొరియా పారిశ్రామికవేత్తలతోనూ లోకేశ్ భేటీ కానున్నారు. ఏపీ-కొరియా సంబంధాల బలోపేతం, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఈ పర్యటన చేయనున్నారు.