రొయ్యకు ‘యుద్ధ’ కష్టం
ABN , Publish Date - Mar 08 , 2026 | 06:11 AM
రొయ్యల ఎగుమతులను యుద్ధ భయం వెంటాడుతోంది. ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అరబ్ ప్రాంతమంతా చిక్కుకుపోయింది.
అమెరికా టారిఫ్‌ల నేపథ్యంలో దుబాయ్,
ఈయూకు రవాణా అవుతున్న మన రొయ్య
యుద్ధంతో.. చెన్నై, విశాఖ పోర్టుల్లోనే సరుకు
(కాకినాడ - ఆంధ్రజ్యోతి)
రొయ్యల ఎగుమతులను యుద్ధ భయం వెంటాడుతోంది. ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అరబ్ ప్రాంతమంతా చిక్కుకుపోయింది. దీంతో రాష్ట్రం నుంచి దుబాయ్‌కు వెళ్లే రొయ్యల ఎగుమతులు ఆగిపోయాయి. శ్రీలంక జలాల్లో ఇరాన్ యుద్ధనౌకను అమెరికా కూల్చివేయడంతో.. ఆ దారి కూడా దాదాపు మూసుకుపోయినట్టే! అతి పెద్దదైన అమెరికా మార్కెట్‌కు ఈ జల మార్గంలోనే మన రొయ్యలు రవాణా అవుతాయి. తాజా పరిణామాలతో మన సరుకు ఆ దేశం చేరడమూ కష్టం కావచ్చునని రొయ్యల సాగుదారులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి నెల్లూరు వరకు రొయ్యల ఎగుమతులు దుబాయ్‌కు సాగుతున్నాయి. ఇరాన్ ఇటీవల జరిపిన దాడిలో దుబాయ్‌లోని జెబల్ అలీ పోర్టుపై బాంబులు పడ్డాయి. ఫలితంగా మన రొయ్యల ఆర్డర్లను అక్కడి కంపెనీలు రద్దు చేసుకున్నాయి. అయితే, అప్పటికే సరుకు చెన్నై పోర్టు, విశాఖ కంటైనర్ పోర్టు ద్వారా ఎగుమతికి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఆర్డర్లు నిలిపివేయడంతో ఏంచేయాలో తెలియక ఎగుమతిదారులు తల పట్టుకుంటున్నారు.
ఇక్కడి నుంచే అధికం...
మన దేశం నుంచి అమెరికాకు ఏటా సముద్ర ఉత్పత్తులు భారీగా ఎగుమతి అవుతుండగా, ఇందులో 80ు వరకు మార్కెట్ ఆంధ్రప్రదేఽశ్‌దే. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి విదేశాలకు రూ.21 వేల కోట్ల విలువైన 3.60 లక్షల టన్నుల రొయ్య ఎగుమతులు జరిగాయి. ఇందులో అమెరికా మార్కెట్‌కే అధికంగా ఎగుమతైంది. అయితే గతేడాది ఆగస్టులో మన రొయ్య ఉత్పత్తులపై అమెరికా టారి్‌ఫలు పెంచడంతో ప్రత్యామ్నాయ మార్కెట్లయిన దుబాయ్, యూరోపియన్ దేశాల వైపు మన ఎగుమతిదారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని కొన్ని ఎగుమతి కంపెనీలకు దుబాయ్ నుంచి భారీగా ఆర్డర్లు వచ్చాయి. అయితే, ఈ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. తాజా యుద్ధ భయాలతో ఆర్డర్లు రద్దు కావడంతో ఎగుమతిదారులకు ఊపిరి సలపడం లేదు. ఇప్పటికప్పడు రద్దయిన లక్షల టన్నుల రొయ్య ఉత్పత్తులను వేరే దేశాలకు పంపే మార్గం లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.