1.33 లక్షల వేదికలు.. 1.07 కోట్ల మంది
ABN , Publish Date - Jun 21 , 2026 | 04:29 AM
రాష్ట్రవ్యాప్తంగా 1.33 లక్షల వేదికలు.. 1.07 కోట్ల మందితో యోగాసనాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా..
నేడు రాష్ట్రవ్యాప్తంగా యోగాసనాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పట్టణాల నుంచి పల్లెల వరకు సిద్ధం
బెజవాడ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎం
ప్రత్యేక అతిథులుగా రామ్‌దేవ్, మంతెన
యోగా ట్రైనర్ల కేటగిరిలో ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’
అమరావతి, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 1.33 లక్షల వేదికలు.. 1.07 కోట్ల మందితో యోగాసనాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు నగరాల్లో ఆరోగ్యాభిలాషులకు మాత్రమే పరిమితమైన యోగా.. కూటమి ప్రభుత్వ చొరవతో ఇప్పుడు పల్లెల వరకు చేరింది. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర-2026 పేరుతో దేశంలో ఏపీలో మాత్రమే రెండు వారాల పాటు యోగాసన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ నెల 7న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన యోగాంధ్ర కార్యక్రమాలు శనివారంతో ముగిశాయి. ఆదివారం ఉదయం అమరావతిలో రాష్ట్ర స్థాయి.. జిల్లా కేంద్రాల నుంచి గ్రామ/వార్డు సచివాలయాల వరకు యోగాసన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. యోగాను కేవలం వ్యాయామంగా కాకుండా జీవనశైలిగా మలచాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భాగస్వామ్య రిజిస్ట్రేషన్ల ద్వారా 1,07,41,148 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. జిల్లాల జనాభా ప్రాతిపదికన 1,04,93,947 మందిని రిజిస్ట్రేషన్లు చేయించాలని లక్ష్యంగా పెట్టుకోగా, దీనిని అధిగమించి అదనంగా 2,47,201 మంది పేర్లు నమోదు చేసుకున్నారని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్‌కుమార్ తెలిపారు.
జిల్లాల మధ్య పోటీ..
యోగాసన కార్యక్రమాలు, ఏర్పాట్లు, ఇతర అంశాల్లో ప్రభుత్వం జిల్లా అధికారుల మధ్య పోటీ పెట్టింది. రిజిస్ట్రేషన్లు, ట్రైనర్లకు శిక్షణ, పౌరుల మ్యాపింగ్, వేదికల ఖరారు, యోగా పోటీల కేటగిరిల్లో.. అన్నింటిలో ఏలూరు తొలి స్థానంలో నిలిచింది. పశ్చిమ గోదావరి జిల్లా రెండు, శ్రీకాకుళం మూడు, మార్కాపురం నాలుగు, అనంతపురం జిల్లా 5వ స్థానంలో నిలిచాయి. మరోవైపు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 26 థీమాటిక్ యోగాసనాలు జరగ్గా 35,603 మంది పాల్గొన్నారు. పర్యాటక ప్రాంతాల్లో 56 కార్యక్రమాలు జరగ్గా 59,458 మంది పాల్గొన్నారని ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ తెలిపారు.
యోగాంధ్రతో ప్రజల్లో చైతన్యం: సత్యకుమార్
యోగాంధ్ర కార్యక్రమాలతో యువత, మహిళల్లో చైతన్యం కనిపిస్తోందని మంత్రి సత్యకుమార్ అన్నారు. యోగా ద్వారా కుటుంబ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చన్న సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్నారు. దీని వల్లే లక్ష్యానికి మించి రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు
రాష్ట్రవ్యాప్తంగా 2.6 లక్షల మంది యోగా ట్రైనర్లను సిద్ధం చేయడం ద్వారా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం దక్కనుంది. 2.6 లక్షల మంది ట్రైనర్ల ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారికి యోగాసనాలపై శిక్షణ ఇచ్చారు. ఇంతకుముందు 1.5 లక్షల మంది ట్రైనర్లు మాత్రమే.
ప్రజాప్రతినిధులు.. అధికారులు
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రత్యేక అతిథులుగా ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్, యోగా అండ్ నేచురోపతి ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు పాల్గొంటారు. జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా 1.33 లక్షల వేదికల ద్వారా 1,07,41,148 మంది యోగాసనాలు చేయనున్నారు. ఆయా కార్యక్రమాల్లో సోలో, బృంద పెర్‌ఫార్మెన్స్, ఉత్తమ చాయాచిత్రాలు, పాటలు, వక్తృత్వ, పోటీల్లో ప్రతి భ కనబరిచిన వారికి బహుమతులు అందజేస్తా రు. విజయవాడలో శనివారంజరిగిన కార్యక్రమం లో రాష్ట్రస్థాయి పోటీల విజేతలు 150 మందికి మంత్రి సత్యకుమార్ బహుమతులందించారు.