Share News

ప్రత్యేక కంటైనర్‌ రైళ్లు కావాలి

ABN , Publish Date - Apr 29 , 2026 | 07:35 AM

ఆంధ్రప్రదేశ్‌ నుంచి వ్యవసాయ, ఉద్యానవన, ఆక్వా ఉత్పత్తులు రవాణా చేసేందుకు ప్రత్యేక కంటైనర్‌ రైళ్లు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వే శాఖను కోరారు.

ప్రత్యేక కంటైనర్‌ రైళ్లు కావాలి

  • వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తుల రవాణాకు అవసరం

  • దక్షిణ కోస్తా రైల్వేజోన్‌లో మరిన్ని సెక్షన్లు విలీనం చేయండి

  • రైల్వే మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి

  • పోర్టుల కనెక్టివిటీకి ప్రథమ ప్రాధాన్యం: అశ్వినీ వైష్ణవ్‌

విశాఖపట్నం, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ నుంచి వ్యవసాయ, ఉద్యానవన, ఆక్వా ఉత్పత్తులు రవాణా చేసేందుకు ప్రత్యేక కంటైనర్‌ రైళ్లు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వే శాఖను కోరారు. ఏపీని లాజిస్టిక్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన రైలు కనెక్టివిటీని పెంచాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ నగరం సిరిపురం జంక్షన్‌లోని ‘ది డెక్‌’ భవంతిలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ కార్యాలయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య, తూర్పు, దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త రైల్వే జోన్‌ కార్యకలాపాలు, ఏపీలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పరిధి, కార్యకలాపాలతో సహా ఏపీలోని రైల్వే ప్రాజెక్టులపై అధికారులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఈ ఏడాది జూన్‌ ఒకటో తేదీ నుంచి జోన్‌ కార్యకలాపాలు ప్రారంభించేలా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేయాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని వెల్లడించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో మరిన్ని సెక్షన్లు విలీనం చేస్తూ పాలనాపరమైన మార్పులు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. అరకు, కొత్తవలస సెక్షన్‌, కర్నూలు-డోన్‌ సెక్షన్లను కొత్త జోన్‌లో కలపడం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందన్నారు. అలాగే రాయలసీమలో వివిధ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ నూతన రైల్వే మార్గాలు వేయాలని కేంద్ర మంత్రిని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పోర్టులతో పాటు కొత్తగా నిర్మిస్తున్న మూలపేట, మచిలీపట్నం, రామాయంపేట పోర్టులకు కనెక్టివిటీని పెంచాలన్నారు. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్రలోని నాగపూర్‌, మధ్యప్రదేశ్‌లోని ఇటార్సి, కర్ణాటకలోని బళ్లారి, బెంగళూరు ప్రాంతాలకు ఈ పోర్టుల నుంచి సరకు రవాణా చేసేలా హింటర్‌ ల్యాండ్స్‌ (సరకు నిల్వ ప్రాంతాలు/స్టాకు యార్డులు)కు రైల్వేను అనునంధానం చేయాలన్నారు.


ఓడ రేవుల అనుసంధానికి ప్రాధాన్యం: అశ్వినీ వైష్ణవ్‌

ఏపీలోని ఓడరేవులను అనుసంధానించేందుకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఏపీలో పురోగతిలో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, ప్రతిపాదిత నూతన మార్గాలకు సంబంధించిన పనులను ఆయన సీఎం చంద్రబాబుకు వివరించారు. కోల్‌కతా నుంచి చెన్నై వరకూ నాలుగు లైన్లు చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న రైళ్లకు అదనంగా 500 నడుపుతామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు స్పందిస్తూ... కోల్‌కతా నుంచి చెన్నై వరకు రైల్వే లైన్ల విస్తరణను స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే తూర్పు నుంచి పశ్చిమ తీరానికి అంటే ఏపీ నుంచి ముంబై, కాండ్లా పోర్టుల వరకు ఫ్రైట్‌ కారిడార్‌ (సరకు రవాణా కారిడార్‌) ఏర్పాటు చేయాలని కోరారు. పోర్టులతో రైలు, రోడ్డు మార్గాలను అనుసంధానం చేసేలా గతిశక్తి పథకంలో కారిడార్‌ అభివృద్ధి చేయాలని కోరారు. దీనికి కూడా రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమీక్షలో రైల్వేశాఖ ఉన్నతాధికారులు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌, ఏపీ రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఎమ్మెల్యేలు పి.గణబాబు, పి.విష్ణుకుమార్‌రాజు, తదితరులు హాజరయ్యారు.

Updated Date - Apr 29 , 2026 | 07:35 AM