Share News

ఓడరేవుల అభివృద్ధికి సహకరించండి

ABN , Publish Date - Jul 04 , 2026 | 05:00 AM

సరుకు రవాణా, ఎగుమతులు, దిగుమతులకు అనుకూలమైన అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి చెప్పారు.

ఓడరేవుల అభివృద్ధికి సహకరించండి

  • కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌కు మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూలై 3(ఆంధ్రజ్యోతి): సరుకు రవాణా, ఎగుమతులు, దిగుమతులకు అనుకూలమైన అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో మారిటైమ్‌ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలిపారు. తూర్పు తీరంలో ఏపీని దేశంలోనే ప్రధాన పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా, షిప్‌ బిల్డింగ్‌ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. శుక్రవారం, ఢిల్లీలో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్‌, జల మార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్‌ను ఆయన కార్యాలయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు నేతృత్వంలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఏపీ మారిటైమ్‌ బోర్డు సీఈవో ప్రవీణ్‌ ఆదిత్య, ఉన్నతాధికారులు కలిశారు. అనంతరం భేటీ వివరాలతో ఓ ప్రకటన చేశారు. రాష్ట్రం చేపడుతున్న కీలక మారిటైమ్‌ అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలో తీర ప్రాంత మౌలిక సదుపాయాల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, పోర్టు ఆధారిత అభివృద్ధి కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేపట్టాల్సిన కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నారు. మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు అభివృద్ధిలో విశాఖపట్నం పోర్ట్‌ అథారిటీకి భాగస్వామ్యాన్ని కల్పించాలని సోనోవాల్‌ను కోరినట్లు తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అవసరమైన ఉప్పు భూములను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించేలా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, సాగర్‌మాల పథకం కింద గంగవరం పోర్టు, అనకాపల్లి జిల్లాలోని ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా(ఎఎంఎన్‌ఎ్‌స) పోర్టులకు అనుసంధాన రహదారులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. సాగర్‌మాల 2.0 కింద ప్రతిపాదించిన ఫిషింగ్‌ హార్బర్‌ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, దుగ్గరాజపట్నం మెగా షిప్‌బిల్డింగ్‌ క్లస్టర్‌, అంతర్గత జలమార్గాల అభివృద్ధికి సహకారం అందించాలని కోరినట్లు పేర్కొన్నారు.

Updated Date - Jul 04 , 2026 | 05:00 AM