Share News

Health Department: ఆరోగ్యశాఖకు 567.40 కోట్లు

ABN , Publish Date - Jan 14 , 2026 | 04:30 AM

రాష్ట్ర ఆరోగ్యశాఖ మరో ఘనత సాధించింది. 15వ ఆర్థిక సంఘం ఈ శాఖకు కేటాయించిన నిధుల్లో పూర్తి వాటాను రాబట్టిన మూడో రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది.

Health Department: ఆరోగ్యశాఖకు 567.40 కోట్లు

  • నిధులు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం

  • రూ.2,600 కోట్ల గ్రాంటు కేటాయించిన కేంద్రం

  • మొత్తం నిధులు రాబట్టిన మూడో రాష్ట్రంగా ఏపీ

  • మరిన్ని రాబడతాం: ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ఆరోగ్యశాఖ మరో ఘనత సాధించింది. 15వ ఆర్థిక సంఘం ఈ శాఖకు కేటాయించిన నిధుల్లో పూర్తి వాటాను రాబట్టిన మూడో రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకూ తమిళనాడు, త్రిపుర మాత్రమే కేంద్రం నుంచి ఈ నిధులు మొత్తం పొందాయి. ఆరోగ్య రంగానికి ఆర్థిక సంఘం సిఫారసు చేసిన రూ.2,600 కోట్ల గ్రాంట్‌ మొత్తం విడుదల అయింది. సోమవారం చివరి విడతగా రూ.567.40 కోట్లను కేంద్రం రాష్ట్రానికి జమ చేసింది. రాష్ట్రాల జనాభా, అభివృద్ధి సూచికల ఆధారంగా ఆర్థిక సంఘం నిధులను కేటాయిస్తారు. ఈ మొత్తం నిధుల్లో ఏపీ వాటా 3.39 శాతం వరకూ ఉందని అంచనా వేస్తున్నారు. సోమవారం జరిగిన కార్యదర్శుల సమావేశంలో ఈ నిధులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీ ముగిసిన రెండు గంటల్లోనే ఆరోగ్య శాఖకు కేంద్రం నిధులు విడుదల చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వైద్యసేవల బలోపేతానికి 15వ ఆర్థిక సంఘం కింద కేంద్రం నిధులు మంజూరు చేస్తోంది. వీటిని ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు భవనాల నిర్మాణం, వ్యాధి నిర్ధారణ పరీక్షల మౌలిక సదుపాయాల కల్పన, బ్లాక్‌ లెవల్‌ పబ్లిక్‌ హెల్త్‌ యూనిట్ల కోసం ఖర్చు చేయాలి.


కూటమిలోనే ఖర్చెక్కువ

గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఆర్థిక సంఘం కేటాయించిన నిధుల్లో 57శాతం మాత్రమే సాధించగలిగింది. కూటమి ప్రభుత్వం కేవలం 19 నెలల్లోనే 43 శాతం నిధులు రాబట్టగలిగింది. మొత్తంగా విడుదలైన నిధుల్లో రూ.1,108 కోట్లు కూటమి ప్రభుత్వంలోనే వచ్చాయి. ఇప్పటి వరకూ అందిన నిధుల్లో ఆరోగ్యశాఖ రూ.1,896 కోట్ల వరకూ వ్యయం చేసింది. నిర్మాణాలను వేగవంతం చేయడం, సమయానికి యూసీలు పంపడంతో నిధుల విడుదలకు కేంద్రం కూడా ముందుకొచ్చింది. కూటమి హయాంలో రూ.902 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టారు. ఆర్థిక సంఘం నిధులతో 1,467 ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలు, 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 6 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, బీహెచ్‌పీఎల్‌ నిర్మాణాలు చేపట్టింది.తాజాగా విడుదలైన నిధుల్లో రూ.233.45 కోట్లను ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల నిర్మాణానికి కేటాయించారు. రూ.218.11 కోట్లను వ్యాధి నిర్ధారణకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించనున్నారు. మరో రూ.55.89 కోట్లను గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాల ఏర్పాటుకు కేటాయిస్తారు. పట్ణణ ప్రాంతాల్లో యూపీహెచ్‌సీల నిర్వహణకు రూ.52.71 కోట్లు ఖర్చుచేసే విధంగా ఆరోగ్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. కాగా, నిధుల విడుదలపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక సంఘం నిధులతో పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలు పూర్తి అవుతాయని, కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - Jan 14 , 2026 | 04:31 AM