సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లోనూ క్లిష్టమైన శస్త్ర చికిత్సలు
ABN , Publish Date - May 24 , 2026 | 04:39 AM
ప్రభుత్వ సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో క్లిష్టమైన శస్త్ర చికిత్సలను కూడా వైద్యులు విజయవంతంగా నిర్వహిస్తున్నారని సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు శనివారం తెలిపారు.
సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధర్‌బాబు వెల్లడి
అమరావతి, మే 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో క్లిష్టమైన శస్త్ర చికిత్సలను కూడా వైద్యులు విజయవంతంగా నిర్వహిస్తున్నారని సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు శనివారం తెలిపారు. అత్యవసర కేసులను రిఫర్ చేయకుండా స్థానిక ఆస్పత్రుల్లోనే శస్త్రచికిత్స చేస్తున్నారని చెప్పారు. ఈ ఏడాది జనవరి 31 నుంచి ఇప్పటి వరకూ 32 సంక్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహించారని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతంలోని రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో మోకాలి మార్పిడి చికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారన్నారు. చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో రెక్టర్ ప్రొలాప్స్, భారీ ఫైబ్రాయిడ్ హిస్టరెక్టమీ (గర్భాశయంలో కణితి) శస్త్ర చికిత్సలను సులువుగా చేశారని చెప్పారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో అరుదైన హెర్నియా రిపేర్ సర్జరీ చేశారని, అనకాపల్లి జిల్లా ఆస్పత్రిలో 4.8 కిలోల శిశువును సాధారణ ప్రసవం ద్వారా కాన్పు చేశారని వివరించారు. ఎమ్మిగనూరులో 16 నెలల్లో 511 క్యాటరాక్ట్ శస్త్ర చికిత్సలు చేశారన్నారు. ధర్మవరం ఏరియా ఆస్పత్రిలో 10 రోజుల్లో లాప్రోస్కోపిక్ విధానంలో నాలుగు సర్జరీలు పూర్తి చేశారన్నారు. ఇలా సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో అరుదైన, క్లిష్టమైన ఆపరేషన్లను సులువుగా పూర్తి చేస్తున్నారని వివరించారు. అలానే జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమల్లో 18 ఆస్పత్రులు ఉత్తమ పనితీరు కనబరిచినట్లు వెల్లడైందని చక్రధర్‌బాబు ఆనందం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తిని నిరంతరం కొనసాగించాలని సూచించారు.