తీరం వెంట రయ్.. రయ్!
ABN , Publish Date - Apr 05 , 2026 | 03:44 AM
సముద్ర తీరం వెంబడి ఎన్‌హెచ్-216(కత్తిపూడి-ఒంగోలు) విస్తరణకు ప్రత్యామ్నాయంగా ‘సముద్ర తీర రహదారి (సీ షోర్ హైవే)’ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి.
బందరు మీదుగా నరసాపురం నుంచి
బాపట్ల వరకు సముద్ర తీర రహదారి
ఎన్‌హెచ్ విస్తరణకు ప్రత్యామ్నాయంగా 120 కి.మీ. మేర నిర్మాణం
ప్రతిపాదనకు సీఎం ఓకే.. గడ్కరీతో చర్చకు యంత్రాంగం సన్నద్ధం
ప్రాథమిక ప్రణాళిక రూపకల్పన.. సాకారమైతే పోర్టులకు కనెక్టివిటీ
సరుకు రవాణాకూ ఊతం.. తర్వాత నెల్లూరు వరకు పొడిగించి
రామాయపట్నం రేవుతో లింకు?.. బీచ్ పర్యాటకానికీ ఊపు
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
సముద్ర తీరం వెంబడి ఎన్‌హెచ్-216(కత్తిపూడి-ఒంగోలు) విస్తరణకు ప్రత్యామ్నాయంగా ‘సముద్ర తీర రహదారి (సీ షోర్ హైవే)’ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. నరసాపురం నుంచి మచిలీపట్నం మీదుగా బాపట్ల వరకు 120 కిలోమీటర్ల పొడవున సరికొత్త సముద్ర తీర రహదారి నిర్మించాలన్న ఆలోచన రూపుదిద్దుకుంటోంది. బందరు పోర్టు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎన్‌హెచ్- 216ని విస్తరించాలని కేంద్రం భావిస్తున్న తరుణంలో.. నూతన ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఎన్‌హెచ్-216ను నరసాపురం నుంచి విస్తరించాలంటే.. భూసేకరణ ఖర్చు చాలానే ఉంటుంది. కాంక్రీట్ విధానంలో రోడ్డు నిర్మాణం చేయాలన్నా భారీగా వ్యయమవుతుంది. సీ షోర్ హైవే అయితే తక్కువ ఖర్చుతో నిర్మాణం చేపట్టవచ్చు. బందరు తీర ప్రాంతానికి మణి మకుటంగా భావించే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి కొల్లు రవీంద్ర తీసుకెళ్లారు. ఆయన కూడా అంగీకారం తెలిపారు. దరిమిలా కేంద్ర రోడ్డురవాణా మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఈ ప్రాజెక్టుకు ఒప్పించాలని మంత్రి నిర్ణయించారు. దీని కోసం ప్రాథమిక ప్రణాళిక తయారవుతోంది. ఈ ప్రణాళికలో.. ఎన్‌హెచ్-216ను విస్తరించకుండా.. కొత్తగా సీ షోర్ హైవే ప్రాజెక్టు చేపడితే కేంద్రానికి ఖర్చు ఎంత మేర తగ్గుతుందో పొందుపరచనున్నారు.
భూసేకరణ అక్కర్లేదు..
సముద్ర తీరం వెంబడి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జడ్) నిబంధనలు ఉన్నప్పటికీ రోడ్ల వంటి నిర్మాణాలు చేపట్టడానికి ఇబ్బంది లేదు. అందువల్ల ఈ ప్రాజెక్టుకు సమస్యలు ఉండవని.. భూముల సేకరణ అవసరం లేదని, పరిహారం సమస్య రాదని గడ్కరీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ‘నరసాపురం నుంచి ఎన్‌హెచ్-216ను విస్తరించాలంటే ఎన్నో భవన నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుంది. వీటికి చెల్లించే నష్టపరిహారం చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. భూములను సేకరించాలంటే భారీగా పరిహారం చె ల్లించాల్సి వస్తుంది. మార్గమధ్యంలో అనేక గ్రామాలకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని చూస్తే సీ షోర్ హైవే ఏర్పాటు ద్వారా తక్కువ ఖర్చుతో వేగంగా నిర్మాణం చేయవచ్చు’ అని ప్రాథమిక ప్రణాళికలో వివరించనున్నారు. తీర ప్రాంతంలో పలు చోట్ల సముద్రంలో కలిసే కాల్వల దగ్గర ఆర్‌వోబీలు లేదా ఫ్లైఓవర్లు నిర్మించాలని ప్రతిపాదించనున్నారు. కేంద్రం ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అంగీకరిస్తే ఎన్ని వరుసల్లో హైవే చేపడతారో స్పష్టత వస్తుంది. బందరు పోర్టును తీర ప్రాంతాలతో అనుసంధానించడం ద్వారా సరుకు రవాణా, పర్యాటక రంగానికి ఊతం కల్పించాలన్నది ప్రధానోద్దేశం.
పోర్టులకు కనెక్టివిటీ..
మచిలీపట్నం పోర్టుకు, బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం పోర్టుకు మధ్య సీ షోర్ హైవే అనుసంధాన వారధిగా ఉంటుంది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలను అనుసంధానిస్తుంది. సరుకు రవాణాకు చాలా సౌలభ్యంగా మారుతుంది. అలాగే పర్యాటక రంగాన్ని కూడా కొత్త మలుపు తిప్పుతుంది. కృష్ణా జిల్లాలోని మంగినపూడి బీచ్ ప్రస్తుతం సందర్శకులకు అందుబాటులో ఉంది. దీనికంటే అద్భుతమైన బీచ్‌లు జిల్లాలో మరెన్నో ఉన్నాయి. పెద్దగొల్లపాలెం, చిన్న గొల్లపాలెం, పెదపట్నం బీచ్‌లు గోవా బీచ్‌లను తలపించేలా ఉంటాయి. హంసలదీవి బీచ్ కూడా అద్భుతంగా ఉంటుంది. సాగర సంగమం ప్రాంతానికి ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. కానీ వీటి వద్దకు వెళ్లడానికి సరైన మార్గం లేదు. వీటితో పాటు డెస్టినీ బీచ్, లోన్లీ బీచ్, ఇంతేరు బీచ్, ఉర్లగొంది తిప్ప బీచ్, పోడు బీచ్.. పశ్చిమ గోదావరి జిల్లాలో పెదమైనవిలంక బీచ్, అంతర్వేది బీచ్.. బాపట్లలో సూర్యలంక బీచ్ ఉన్నాయి. సీ షోర్ హైవే సాకారమైతే ఈ బీచ్‌లన్నింటికీ మంచి దారి ఏర్పడుతుంది. ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా భాసిల్లుతుంది.
తీర ప్రాంతానికి బండ్‌గా..
సీ షోర్ హైవే నిర్మాణం చేపడితే ఇది మచిలీపట్నం తీరానికి ఒక బండ్‌గా ఉంటుంది. దీని కారణంగా సముద్రపు కోతలను నివారించవచ్చు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలో పెద్దగొల్లపాలెం, చిన్న గొల్లపాలెంలో పెద్దఎత్తున సముద్రపు ఒడ్డు కోతకు గురవుతోంది. బండ్ రూపుదిద్దుకుంటే కోతలకు ఆస్కారం ఉండ దు.