Share News

బడుల్లో చిరుధాన్యాల చిక్కీ

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:32 AM

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సర్కారీ బడుల్లో విద్యార్థులకు అందిస్తున్న చిక్కీని ప్రభుత్వం మరింత బలవర్థకంగా మార్చింది. విద్యార్థుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించి..

బడుల్లో చిరుధాన్యాల చిక్కీ

  • వారంలో మూడు రోజులు పంపిణీ

  • 15 రోజులకొకసారి స్కూళ్లకు స్టాక్‌

  • 2 లేదా అంతకంటే ఎక్కువ పొరలతో

  • మల్టీ లేయర్‌ ప్యాకేజింగ్‌ తప్పనిసరి

  • సరఫరాదారులకు ప్రభుత్వం ఆదేశం

అమరావతి, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సర్కారీ బడుల్లో విద్యార్థులకు అందిస్తున్న చిక్కీని ప్రభుత్వం మరింత బలవర్థకంగా మార్చింది. విద్యార్థుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించి, వారి శారీరక ఎదుగుదలతో పాటు చదువుపై ఏకాగ్రతను పెంచేలా రాగులు, జొన్నలు, సజ్జలు తదితర చిరుధాన్యాలతో రూపొందించిన ‘పీనట్‌ మిల్లెట్‌ జాగరీ చిక్కీ’ని అందిస్తోంది. గతంలో పల్లీలు, బెల్లం, పంచదార, లిక్విడ్‌ గ్లూకోజ్‌, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బీ12తో కూడిన చిక్కీలు ఇచ్చేవారు. పిల్లలకు మరింత సహజసిద్ధమైన పీచు పదార్థం (ఫైబర్‌), ఐరన్‌, కాల్షియం అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి పోషక విలువలతో కూడిన సరికొత్త మిల్లెట్‌ చిక్కీని వారానికి 3 రోజులు (సోమ, బుధ, శుక్రవారాలు) పంపిణీ చేస్తోంది. ఈ చిక్కీల స్టాక్‌ను సరఫరాదారులు ప్రతి 15రోజులకు ఒకసారి బడులకు చేర్చాలని, అవి పాడవకుండా ఉండేందుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ పొరలతో మల్టీ లేయర్‌ ప్యాకేజింగ్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని జిల్లాలను 6 ప్యాకేజీలుగా విభజించి.. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సకాలంలో సరఫరా చేసేలా ఏర్పాట్లు చేసింది. ఐరన్‌, కాల్షియం, ఫైబర్‌ను సహజసిద్ధంగా అందించేందుకు అత్యధిక పోషకాలతో కూడిన చిరుధాన్యాలతో తయారు చేసిన ‘మిల్లెట్‌ చిక్కీ’ని పాఠశాల విద్యార్థులకు అందించడం దేశానికే ఒక మోడల్‌గా నిలుస్తుందని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం సంచాలకుడు బి.శ్రీనివాసరావు శనివారం తెలిపారు.

Updated Date - Jun 21 , 2026 | 04:33 AM