రాయలసీమ స్టీల్ ప్లాంట్‌కు 4 లేన్ల రోడ్డు
ABN , Publish Date - Jul 04 , 2026 | 04:53 AM
వైఎస్సార్ కడప జిల్లా జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్‌ప్లాంట్ (కడప స్టీల్స్) కోసం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.
రూ. 68 కోట్ల నిధులు మంజూరు
అమరావతి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): వైఎస్సార్ కడప జిల్లా జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్‌ప్లాంట్ (కడప స్టీల్స్) కోసం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. జమ్మలమడుగులోని జాతీయ రహదారి (ఎన్‌హెచ్-67) నుంచి ఆ స్టీల్‌ప్లాంట్ వరకు 12 కిలోమీటర్ల మేర 4 వరుసల రహదారి నిర్మాణానికి నిధులకు ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు నిర్మాణానికి గతంలో ఆమోదించిన రూ. 50 కోట్ల అంచనా వ్యయాన్ని రూ.68 కోట్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సవరించిన పరిపాలన అనుమతినిచ్చింది. ఏపీఐఐసీ వద్ద అందుబాటులో ఉన్న నిధుల నుంచి ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి.. తర్వాత సాస్కీ నిధుల కింద రీయింబర్స్‌మెంట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఏపీఐఐసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరును ఆదేశిస్తూ రాష్ట్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్.యువరాజ్ శుక్రవారం ఉత్తర్వులు విడుదలచేశారు. గతంలో మంజూరు చేసిన రూ.50కోట్లలో ఇప్పటికే రూ.19.37కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. మిగిలిన రోడ్డు పనులు, పైపు కల్వర్టులు, డ్రైనేజీలు, మైనర్ వంతెనలకు రూ.48.63 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. దీంతో రూ.68 కోట్లకు సవరించిన పరిపాలన అనుమతివ్వాలని ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ప్రభుత్వం అందుకనుగుణంగా నిర్ణయం తీసుకుంది. అంతేగాకాకుండా జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కోసం విద్యుత్తు, నీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీని కూడా ప్రకటించింది. ఈ ప్లాంట్‌కు సంబంధించి వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ వద్దనున్న 11 ఎకరాల భూమిని జేఎ్‌సడబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్‌కు బదిలీ చేయడానికి ప్రభుత్వం అనుమతించింది.