క్షురకుడికి 70.29 లక్షల జీఎస్టీ!
ABN , Publish Date - Apr 09 , 2026 | 04:58 AM
ఆయన నిర్వహించేది చిన్న సెలూన్ షాపు. వ్యాపారం అంతంత మాత్రమే. ప్రతి నెలా బడ్జెట్ లెక్కలు వేసుకుంటూ సంసారాన్ని ఈదుతున్న మధ్యతరగతి జీవితం.
చెల్లించాలంటూ అధికారుల నోటీసు
ఎవరో పాన్‌కార్డు మార్ఫింగ్ చేసి వాడినట్టు గుర్తింపు
విజయవాడ, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ఆయన నిర్వహించేది చిన్న సెలూన్ షాపు. వ్యాపారం అంతంత మాత్రమే. ప్రతి నెలా బడ్జెట్ లెక్కలు వేసుకుంటూ సంసారాన్ని ఈదుతున్న మధ్యతరగతి జీవితం. అటువంటి వ్యక్తికి జీఎస్టీ కింద రూ.70.29 లక్షలు చెల్లించాలంటూ సీజీఎస్టీ అధికారులు నోటీసు జారీ చేశారు. తన పాన్ కార్డును మార్ఫింగ్ చేసి ఎవరో వాడారంటూ రెండు నెలలుగా ఆయన పోలీసులకు, సీజీఎస్టీ అధికారులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోయింది. విజయవాడ పంజాసెంటర్‌కు చెందిన పైడాడ శ్రీనివాసరావు సెలూన్ షాపు నిర్వహిస్తున్నారు. వన్‌టౌన్‌లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆయనకు సేవింగ్స్ ఖాతా ఉంది. షాపులో ఏర్పాటు చేసుకున్న ఫోన్‌పే స్కానర్‌కు ఈ ఖాతా ను అనుసంధానం చేయించుకున్నారు. ఫిబ్రవరి నెలాఖరున ఆయన ఖాతా నుంచి లావాదేవీలు నిలిచిపోయాయి. కస్టమర్లు ఫోన్‌పే ద్వారా చెల్లించే డబ్బులు ఖాతాలో జమయ్యేవి, కానీ.. నిల్వ మాత్రం సున్నా చూపించేది.బ్యాంక్ అధికారులను సంప్రదించగా.. రూ.70,29,922 జీఎస్టీ చెల్లించాలని వైజాగ్‌లోని సెంట్రల్ సీజీఎస్టీ కార్యాలయం నుంచి నోటీసు వచ్చిందని, అందువల్ల ఖాతాను స్తంభింపజేశామని వివరించారు. శ్రీనివాసరావు పాన్ కార్డు నెంబరుతో వైజాగ్ కేంద్రంగా ఆనంద్ ఐరన్ ట్రేడర్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారని, దాని ద్వారా భారీగా ఇనుము వ్యాపారం జరిగినట్టు జీఎస్టీ రికార్డులు చూపిస్తున్నాయని తెలిపారు. శ్రీనివాసరావు పాన్‌కార్డు, ఆధార్‌కార్డు ఫొటోస్టాట్, వేరొక ఈ మెయిల్‌తో గుర్తుతెలియని వ్యక్తి జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించినట్టు తేలింది. పన్ను, జరిమానా, వడ్డీ కలిపి మొత్తం రూ.70,29,922 చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు పన్ను చెల్లించలేదని వివరించారు. అయితే, ఆనంద్ ఐరన్ ట్రేడర్స్‌తో తనకు సంబంధమే లేదని, తన ధ్రువీకరణపత్రాలను ఎవరో మార్ఫింగ్ చేసి వాడుకున్నారని సీజీఎస్టీ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పరిష్కరించడం లేదని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.