ఆర్టీసీలో ఈ-గోల!
ABN , Publish Date - Jun 15 , 2026 | 03:52 AM
డీజిల్ వినియోగం తగ్గించి, పర్యావరణ ముప్పును అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కూడా ఎలక్ట్రిక్ బస్సులే సమకూర్చుకుని 2030 నాటికి పల్లె వెలుగు బస్సుల స్థానంలో..
ఈ-బస్సులపై ముందుకే!
సర్కారు నిర్ణయం.. సంఘాల విముఖత
రాష్ట్రంలోని 12 ప్రాంతాలకు బస్సుల రాక
తొలి విడత 1,050.. రెండో విడత 1,450
పుణెకి చెందిన ఫినాకిల్ ద్వారా ఆపరేషన్
ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి
వ్యతిరేకిస్తున్న ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ నేతలు
ప్రైవేటు వద్దు.. ఆర్టీసీతోనే నడపాలని డిమాండ్
కేంద్ర సబ్సిడీ, డిపోల్లో పార్కింగ్, చార్జింగ్ స్టేషన్లు
ప్రభుత్వ అడుగులు వేగం.. జేఏసీ ఉద్యమ బాట
పర్యావరణ హిత, ఇంధన పొదుపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బస్సులను తీసుకురానుంది. ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 12 నగరాల్లో ఈ-బస్సులు నడిపేలా ప్రణాళిక సిద్ధం చేసింది. కేంద్రం ఇచ్చే సబ్సిడీని సద్వినియోగం చేసుకుని.. ఆర్టీసీ భారాలను తగ్గించుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే.. ఈ వ్యవహారాన్ని ఆర్టీసీ జేఏసీ నాయకులు తప్పుబడుతున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
డీజిల్ వినియోగం తగ్గించి, పర్యావరణ ముప్పును అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కూడా ఎలక్ట్రిక్ బస్సులే సమకూర్చుకుని 2030 నాటికి పల్లె వెలుగు బస్సుల స్థానంలో ఈ-బస్సులనే నడిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్‌కు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగంగా పూర్తి చేస్తోంది. అయితే.. ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ-బస్సులకు తాము వ్యతిరేకం కాదని చెబుతూనే.. కేంద్రం ఇచ్చే సబ్సిడీతోపాటు డిపోల స్థలాలను ప్రైవేటుకు అప్పగించడాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ స్వయంగా కొనుగోలు చేసి నడిపించాలని, ప్రైవేటు వ్యక్తులు ప్రయాణ సేవలు అందించడంలో విఫలమైతే ప్రజల నుంచి ఆర్టీసీకి వ్యతిరేకత వస్తుందని ఉద్యోగ సంఘాల జేఏసీ చెబుతోంది. అంతేకాదు, ఈ-బస్సులు ప్రైవేటు యాజమాన్యం చేతిలో ఉంటాయని, ఆర్టీసీకి భాగస్వామ్యం ఉండదని జేఏసీ నేతలు అంటున్నారు. ఇక, ఆక్యుపెన్సీతో సంబంధం లేకుండా ప్రతి కిలో మీటరుకు రూ.72 ఇవ్వడం సరికాదని చెబుతున్నారు. కాగా, ఈ విషయంలో ప్రభుత్వ వాదన మరో విధంగా ఉంది. ఆర్టీసీ సొంతంగా నడపాలంటే బస్సుల కొనుగోలుకు రూ.వందల కోట్లు అవసరమవుతాయని, సిబ్బంది నియామకం కూడా చేపట్టాలని పేర్కొంది. కేంద్రం జాతీయ స్థాయిలో తీసుకున్న పాలసీనే ఏపీలోనూ అమలు చేస్తున్నామని తెలిపింది. ఇది సంస్థకు ఆర్థికంగా భారంగా కాదని వివరిస్తోంది.
సమస్యల్లో ఆర్టీసీ
ప్రస్తుతం ఏపీఎ్‌సఆర్టీసీ సమస్యల్లో కొట్టు మిట్టాడుతోంది. కాలం చెల్లిన బస్సులు నడపలేక, సిబ్బంది కొరత అధిగమించలేక ఆపసోపాలు పడుతోంది. మరోవైపు ‘స్త్రీ శక్తి’తో భారీగా పెరిగిన ప్రయాణికులకు సేవలందించడం కూడా ఇబ్బందిగా మారింది. బస్సుల సంఖ్య పెంచి సిబ్బంది నియామకాలు చేపట్టాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్‌పై సమీక్షించిన ప్రభుత్వం ఆర్థిక వనరులు ఆ స్థాయిలో లేక కేంద్రం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విద్యుత్ బస్సులు ప్రవేశ పెట్టి ఆర్థిక భారం నుంచి బయట పడాలని భావిస్తోంది. అదేసమయంలో ప్రయాణికులకు మెరుగైన సేవలు కూడా అందుతాయని అంచనా వేసింది.
పీఎం-ఈ బస్
పర్యావరణ పరిరక్షణ, డీజిల్ ఇబ్బందుల్ని అధిగమించే క్రమంలో దేశ వ్యాప్తంగా ప్రధా ని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు ఇస్తోంది. దీనిలో భాగంగా ప్రజా రవాణా కోసం వినియోగించే బస్సులకు ‘పీఎం ఈ-బస్’ కింద భారీ సబ్సిడీ ఇస్తోంది. దీంతోపాటు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(మహువా) కూడా విద్యుత్ బస్సులను సమకూరుస్తోంది. అలాగే, పూర్వోదయ పేరుతోనూ ఈ-బ్‌సల కోసం మరో పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. మన రాష్ట్రంలో బస్సుల కొరత అధిగమించేందుకు ఏపీఎ్‌సఆర్టీసీ ఈ మూడు పథకాల కింద బస్సులు కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. ‘పీఎం ఈ-బస్’ కింద రాష్ట్రానికి ఇప్పటికే 750 బస్సులు మంజూరయ్యాయి. మహువా పథకం ద్వారా మరో 300 బస్సులు సిద్ధం అవుతున్నాయి. పూర్వోదయ స్కీమ్ కింద 1,450 బస్సుల కోసం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది చివరికల్లా మొత్తం 2500 విద్యుత్ బస్సులు రాష్ట్రానికి రాన్నాయి. వాటిలో అమరావతి(మంగళగిరి) -50, అనంతపురం-50, గుంటూరు 2డిపో- 100, కడప-50, కాకినాడ-50, కర్నూలు-50, నెల్లూరు 2డిపో-100, రాజమహేంద్రవరం- 50, తిరుపతి-350(అలిపిరి, తిరుమల, మంగళం), విద్యాధరపురం(విజయవాడ)- 100, గాజువాక(విశాఖపట్నం) -100 చొప్పు న బస్సులు కేటాయించారు. ఈ-బస్సుల విషయంలో ప్రభుత్వం దూసుకుపోతుంటే దీనికి భిన్నంగా జేఏసీ నాయకులు ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం చర్చనీయాంశమైంది.
వేగంగా మౌలిక సదుపాయాలు..
ఇప్పటి వరకు డీజిల్ బస్సుల్ని నడిపించిన ఏపీఎ్‌సఆర్టీసీలోకి విద్యుత్ బస్సులు ప్రవేశిస్తే చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు తప్పనిసరి. దీనికిగాను రాష్ట్రంలోని 12 డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులకు విద్యుత్ అంతరాయం లేకుండా చార్జింగ్ స్టేషన్లతో పాటు సర్వీసింగ్‌కు వసతులు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో గాజువాక, విద్యాధరపురం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి బస్ డిపోలను ఫినాకిల్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఆర్టీసీ అప్పగించింది. మిగతా 7 డిపోల్లో ఆర్టీసీకి యాభై శాతం వాటా ఉంటుంది. ప్రతి డిపోలోనూ రూ.16 కోట్ల ఖర్చుతో విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి కేంద్రం నుంచి ఆర్టీసీకి సబ్సిడీ లభిస్తుంది. విద్యుత్ చార్జింగ్ చేసుకునే బస్సులకు యూనిట్ చొప్పున డబ్బులు తీసుకునే ఆర్టీసీ ప్రతి కిలో మీటరుకు ఈ-బస్ యజమానికి రూ.72 అద్దె చెల్లించాలి. దీనిలో కేంద్ర ప్రభుత్వం రూ.24 భరిస్తే ఆర్టీసీ మిగతా రూ.48 చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా ప్రైవేటీకరణలో భాగమేనని ఉద్యోగ సంఘాల జేఏసీ ఆరోపిస్తోంది. డిపోలు ఆర్టీసీవి.. విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేది ఆర్టీసీ.. ప్రయాణీకులకు సేవలందించేంది ఆర్టీసీ.. కానీ కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ, ఏపీఎ్‌సఆర్టీసీ నుంచి అద్దె మాత్రం ప్రైవేటు ఆపరేటర్‌కు ఇవ్వడం ఏంటి?.. అని జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
పెట్టుబడి, నిర్వహణ వారిదే..
ఒక్కో ఎలక్ర్టిక్ బస్సు కొనుగోలు చేయాలంటే రూ.కోటికి పైగా ఖర్చవుతుందని, డ్రైవర్ జీతం, బస్ మెయింటెనెన్స్, బ్యాటరీ జీవిత కాలం అన్నీ లెక్కించే ప్రభుత్వం ఖరారు చేసిందని విద్యుత్ బస్సుల టెండర్ దక్కించుకున్న పుణేకు చెందిన ప్రైవేటు ఆపరేటర్ ఫినాకిల్ మొబిలిటీ చెబుతోంది. మరోవైపు, ప్రతి నెలా ఆర్టీసీ సిబ్బందికి రూ.300 కోట్ల మేర జీతాలు.. ‘స్త్రీ శక్తి’ ఉచిత ప్రయాణాలు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... ఇప్పటికిప్పుడు సొంతంగా ఆర్టీసీకి ఈ-బస్సులు కొనిచ్చే పరిస్థితి లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక, డ్రైవర్ల నియామకాలు, నిర్వహణ వంటివి ఆర్టీసీకి భారంగా మారినట్లు చెబుతున్నారు. కేంద్రం అందిస్తున్న అవకాశాన్ని అన్ని రాష్ట్రాలూ సద్వినియోగం చేసుకొంటున్నాయని, దీనిలో భాగంగానే రాష్ట్రంలోనూ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
గాడిలో పెట్టండి: జేఏసీ
రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆర్టీసీలో 60 వేల మంది సిబ్బంది.. 12,500 బస్సులు ఉన్నాయి. అయితే.. ఈ సంఖ్య ఏటా తగ్గిపోతోంది. గత పదేళ్లలో బస్సుల సంఖ్యతో పాటు సిబ్బంది కూడా తగ్గారు. ఏప్రిల్ 2026 నాటికి 43,315 మంది సిబ్బంది, 8,035 బస్సులు మాత్రమే ఉన్నాయి. అద్దె బస్సులు 2,700 కలిపితే 10,700 బస్సులు మాత్రమే సేవలు అందిస్తున్నాయి. వీటిలో 15 లక్షల కిలోమీటర్లు తిరిగిన వాటిని పక్కన పెట్టి.. కొత్త డీజిల్ బస్సులు కొనుగోలు చేయాలని, సిబ్బంది నియామకం చేపట్టి సంస్థను గాడిలో పెట్టాలని ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేస్తోంది. ఆర్టీసీ పల్లెవెలుగు బస్సుల్లో 55 సీట్లున్నా ప్రయాణికుల రద్దీకి సరిపోవడం లేదని, 25 నుంచి 35 సీట్లు మాత్రమే ఉండే విద్యుత్ బస్సులు మెరుగైన సేవలు ఎలా అందిస్తాయని జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు.