Share News

పట్టణాల్లో ‘ఇంధన’ పొదుపు.. మున్సిపల్‌ శాఖ కార్యాచరణ

ABN , Publish Date - May 20 , 2026 | 04:42 AM

రాష్ట్రంలోని పట్టణాలను పరిశుభ్రంగా, స్మార్ట్‌గా, ఇంధన పొదుపు పరంగా సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

పట్టణాల్లో ‘ఇంధన’ పొదుపు.. మున్సిపల్‌ శాఖ కార్యాచరణ

  • అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో ఎనర్జీ ఆడిట్‌.. పగలు వెలిగే వీధి దీపాలకు చెక్‌.. రూఫ్‌ టాప్‌ సోలార్‌కు ప్రాధాన్యం

  • ఈవీలను ప్రోత్సహించే దిశగా 5 నగరాల్లో పీపీపీ చార్జింగ్‌ స్టేషన్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోని పట్టణాలను పరిశుభ్రంగా, స్మార్ట్‌గా, ఇంధన పొదుపు పరంగా సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో విద్యుత్‌ పొదుపు, ఈవీ చార్జింగ్‌ మౌలిక వసతులు, ఈ-బైక్స్‌, ఈ-స్కూటర్ల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా భారీ కార్యాచరణ చేపట్టారు. ముఖ్యంగా అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో విద్యుత్‌ పొదుపు చర్యలు తీసుకోనున్నారు. రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థలు, విద్యుత్‌ వాహనాల ప్రోత్సాహం, షేర్డ్‌ మైక్రో మొబిలిటి వ్యవస్థల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈనెల 14న మంత్రివర్గం ఆమోదించిన ‘రీసోర్స్‌ కన్జర్వేషన్‌ అండ్‌ సెల్ఫ్‌ రిలయెన్స్‌’ కార్యాచరణ ప్రణాళిక భాగంలో ఈ ఇంధన పొదుపు చర్యలు చేపడుతున్నారు.

సమగ్రంగా ఎనర్జీ ఆడిట్‌

రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎనర్జీ ఆడిట్‌ నిర్వహించాలని మున్సిపల్‌ శాఖ ఆదేశించింది. ఇందులో భాగంగా వీధి దీపాలు, మున్సిపల్‌ భవనాలు, నీటి సరఫరా పంపింగ్‌ స్టేషన్లు, మురుగు నీటి శుద్దికేంద్రాల వద్ద విద్యుత్తు వినియోగం, వాహనాల వినియోగంపై సమగ్ర అధ్యయనం చేపట్టనున్నారు. మొదట మున్సిపల్‌ కార్పొరేషన్లు, సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీల్లో ఈ ఆడిట్‌ ప్రారంభించి, తర్వాత మిగిలిన పట్టణ స్థానిక సంస్థలకు విస్తరించనున్నారు. ఏపీయూఐఏఎంఎల్‌, బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ, ఈఈఎ్‌సఎల్‌, విజయవాడ ఎస్పీఏ సహకారంతో ఈ ప్రక్రియ కొనసాగనుంది.


పగలు వెలిగే వీధి దీపాలకు చెక్‌

పగటి పూట వీధి దీపాలు వెలగడాన్ని పూర్తిగా నివారించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సాధారణ లైట్ల స్థానంలో ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేయడం, రాత్రి తక్కువ ట్రాఫిక్‌ సమయంలో లైట్ల ప్రకాశాన్ని తగ్గించడం, అవసరం లేని అలంకార లైటింగ్‌ను నియంత్రించడం వంటి చర్యలు తీసుకోనున్నారు. అలాగే మున్సిపల్‌ కార్యాలయాల్లో అవసరం లేని విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించడం, ఏసీలను కనీసం 24 డిగ్రీల వద్ద నిర్వహించడం, పార్కుల్లో అలంకార లైటింగ్‌ను పరిమితం చేయాలని ఆదేశించారు. అన్ని రకాల ప్రభుత్వ భవనాలపై రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థల ఏర్పాటుకు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీడీఎంఏ)కు సూచించారు. డిస్కమ్‌ల నెట్‌ మీటరింగ్‌, ఆర్థిక నమూనాలు, ప్రభుత్వ పథకాల అనుసంధానం వంటి అంశాలను పరిశీలించనున్నారు.

విద్యుత్‌ బిల్లుల తగ్గింపుపై దృష్టి

నీటి సరఫరా, మురుగునీటి పంపింగ్‌ స్టేషన్లలో విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. ఆఫ్‌-పీక్‌ అవర్స్‌లో పంపింగ్‌, పాత మోటార్ల పరీక్షలు, ఓవర్‌ ఫ్లో నియంత్రణ, అధిక విద్యుత్‌ బిల్లులు వచ్చే స్టేషన్లలో సామర్థ్య పెంపు చర్యలు చేపట్టాలని సూచించారు. మున్సిపల్‌ వాహనాల ఇంధన వినియోగంపై కూడా కఠిన పర్యవేక్షణ చేయనున్నారు. డీజిల్‌ వాహనాల స్థానంలో దశల వారీగా ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రవేశపెట్టే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.


ఐదు నగరాల్లో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు

విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతిని మోడల్‌ ఈ-మొబిలిటీ నగరాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నగరానికి రూ.50 కోట్ల కార్పస్‌ నిధులతో ప్రతి మూడు కిలోమీటర్ల పరిధిలో ఒక ఈవీ చార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకుంది. పార్కింగ్‌ స్థలాలు, బస్‌బేలు, మార్కెట్‌ యార్డులు, మున్సిపల్‌ భవనాల్లో పీపీపీ విధానంలో చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రైవేట్‌ భాగస్వాములు చార్జింగ్‌ పరికరాలు, నిర్వహణ బాధ్యతలు చేపట్టనుండగా.. పట్టణ స్థానిక సంస్థలు స్థలం, అనుమతులు, విద్యుత్‌ కనెక్షన్‌ వంటి సౌకర్యాలు కల్పించనున్నాయి. యాప్‌ ఆధారిత ఈ-స్కూటర్‌, ఈ-బైక్‌ సేవలను ప్రభుత్వం ప్రోత్సహించనుంది. అంతర్జాతీయ సంస్థల నమూనాలను అధ్యయనం చేసి, ఆంధ్రప్రదేశ్ కు అనుకూలమైన విధానాన్ని రూపొందించాలని సీడీఎంఏకు ఆదేశాలిచ్చారు. డాకింగ్‌ జోన్లు, పార్కింగ్‌ నియంత్రణ, జియో ఫెన్సింగ్‌, వేగ పరిమితులు, హెల్మెట్‌ భద్రత, బీమా, రియల్‌టైం డేటా షేరింగ్‌ వంటి నిబంధనలు అమలు చేయనున్నారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఐటీ కారిడార్లు, విద్యాసంస్థలు, పర్యాటక ప్రాంతాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

Updated Date - May 20 , 2026 | 04:42 AM