రోడ్డు ప్రమాదాల కట్టడికి ‘బ్రేకులు’!
ABN , Publish Date - May 11 , 2026 | 03:55 AM
‘‘రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు బ్రేకులు పడాల్సిందే! అందుకు అవసరమైన అన్ని పరికరాలూ కొనుగోలు చేయండి’ అని గతేడాది చివర్లో సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు.
సీఎం ఆదేశాల అమలుపై పోలీసు, రవాణా శాఖ అధికారుల మీనమేషాలు
స్పీడ్ గన్స్, బ్రీత్ ఎనలైజర్లు, సీసీ కెమెరాల వంటి పరికరాలు కొనుగోలు చేయకుండా చోద్యం
అందుబాటులో నిధులున్నా టెండర్లు పిలవని వైనం
టెండర్ల బాధ్యత ఏపీటీఎస్‌పైకి నెట్టే యత్నం
నిధుల విషయంలో ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఉంటేనే ముందుకెళ్తామన్న ఆ అధికారులు
ఎటూ కాకుండా పోయిన కొనుగోళ్ల వ్యవహారం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘‘రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు బ్రేకులు పడాల్సిందే! అందుకు అవసరమైన అన్ని పరికరాలూ కొనుగోలు చేయండి’ అని గతేడాది చివర్లో సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. బ్లాక్ స్పాట్‌లను మరమ్మతులు చేయాలని రోడ్లు, భవనాల శాఖను.. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు స్పీడ్ గన్స్, బ్రీత్ ఎనలైజర్లు, సీసీ కెమెరాలు, బారికేడ్లు వంటివి కొనుగోలు చేయాలని పోలీసు, రవాణా అధికారులకు స్పష్టం చేశారు. అయితే పరికరాల కొనుగోలులో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. టెండర్లు పిలవకుండా చోద్యం చూస్తున్నారు. ఓవైపు పోలీసులు వాహనదారుల నుంచి ఫైన్‌ల రూపంలో వసూలు చేసిన సొమ్ము, మరోవైపు రవాణాశాఖ వాహనాలపై రోడ్ సేఫ్టీ సెస్ రూపంలో వసూలు చేస్తున్న కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ.. ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. పోలీసు, రవాణా శాఖలు టెండర్లు పిలిచే బాధ్యతను ఏపీటీఎస్‌పైకి నెట్టేయాలని చూడగా.. ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ లభిస్తేనే టెండర్లకు వెళ్తామని ఏపీటీఎస్ అంటోంది. దీంతో ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నా అక్కడి అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
వేలాది మంది ప్రాణాలు గాలికి..
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా.. అంతకంటే ఎక్కువ సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు. నిర్లక్ష్యం, అతివేగం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, హెల్మెట్ ధరించకపోవడం, మద్యం సేవించి వాహనం నడపడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వల్ల వేలాది మంది ప్రాణాలు రోడ్లపైనే పోతున్నాయి. గత పదేళ్లలో రాష్ట్రంలో ఏటా సుమారు 23 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే.. దాదాపు 8,750మంది ప్రాణాలు కోల్పోతున్నారు. క్షతగాత్రుల సంఖ్య ఏటా 27వేల వరకూ ఉంటోంది. 2014లో 7862గా ఉన్న మరణాల సంఖ్య.. 2024లో 8158కు పెరిగింది.
రోడ్ సేఫ్టీ అథారిటీ ఉన్నా..
ప్రయాణికులు, వాహనదారుల భద్రత కోసం పోలీసు శాఖలో డీజీపీ ర్యాంకు అధికారి చైర్మన్‌గా ఉండే రోడ్ సేఫ్టీ అథారిటీ ఒకటి ఉంటుంది. పోలీసులు వాహనదారులకు రాసే చలానాల సొమ్ములో 40 శాతాన్ని ఈ అథారిటీ ద్వారా ఖర్చు చేసి, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు గతంలో స్పష్టంగా చెప్పింది. అయితే రాష్ట్రంలో ఆ పరిస్థితి గత కొన్నేళ్లుగా కనిపించడం లేదు. ఇక రవాణా శాఖ అయితే ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం మినహా నిరంతర రక్షణ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కర్నూలు, మార్కాపురం బస్సు ప్రమాదాల ఘటనల తర్వాత ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి.. ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేయడం తప్ప.. మరేమీ జరగడం లేదు. ప్రతి మూడు నెలలకు ఒకసారైనా ఇలాంటి చర్యలు చేపడితే.. పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేకపోలేదు.
అన్నీ ఉన్నా.. ఫలితం శూన్యం
పరికరాల కొనుగోలుకు నిధులు అందుబాటులో ఉంటేనే టెండర్లు పిలుస్తామంటూ ఏపీటీఎస్ అధికారులు చెబుతున్నట్లు తెలిసింది. అందుకు ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించాల్సి ఉందని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఆర్థిక శాఖ చుట్టూ పోలీసు, రవాణా అధికారులు తిరుగుతున్నా అక్కడి అధికారులు పట్టించుకోవడం లేదని సమాచారం. వాహనదారులు జరిమానాలు చెల్లిస్తున్నా, కొనుగోలుదారులు రోడ్ సేప్టీ సెస్ కడుతున్నా, రోడ్డు ప్రమాదాల కట్టడికి సీఎం ఆదేశాలిచ్చినా, అందుకు పోలీసు, రవాణా అధికారులు సిద్ధంగా ఉన్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు.
నిధులు ఉన్నా.. కొనుగోళ్లకు గ్రహణం
పోలీసు శాఖ వాహనదారుల నుంచి జరిమానాల రూపంలో వసూలు చేసిన నిధుల్లో 40 శాతం రోడ్ సేఫ్టీకి వినియోగించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు.. పోలీసు శాఖ సమారు రూ.40 కోట్లు పక్కనబెట్టింది. అయితే బ్రీత్ ఎనలైజర్లు, స్పీడ్ గన్స్, బారికేడ్లు, సీసీ కెమెరాల కొనుగోలుకు టెండర్ మాత్రం పిలవడం లేదు. అదేవిధంగా రవాణా శాఖకు కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్రంలో వాహనాల కొనుగోలుపై రోడ్ సేఫ్టీ సెస్ రూపంలో వసూలు చేస్తోన్న సొమ్ము ఏడాదికి రూ.300 కోట్లకు పైనే వస్తోంది. ప్రస్తుతానికి ఆ డబ్బులు రూ.20 కోట్లకు పైగానే రవాణా శాఖ ఖాతాలో ఉన్నాయి. అయినా టెండర్లు పిలిచి తగిన పరికరాలు కొనుగోలు చేసేలా చర్యలు మాత్రం కానరావడం లేదు.
జెమ్ పోర్టల్ వద్దు.. ఏపీటీఎస్ ముద్దు!
రాష్ట్ర విభజన తర్వాత గత చంద్రబాబు ప్రభుత్వంలో రవాణా, పోలీసు శాఖలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని జెమ్ పోర్టల్‌లో ధరలు పరిశీలించి అందుకు అనుగుణంగా కొనుగోళ్లకు టెండర్లు పిలిచేవి. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నా, ఆయన ఆదేశాల అమలుకు మాత్రం వెనుకడుగు వేస్తున్నాయి. రవాణా, పోలీసు శాఖలు పరికరాల కొనుగోలుకు సిద్ధం అవగానే.. ఇద్దరు రాజకీయ పెద్దలు రంగంలోకి దిగి వాటాలపై చర్చలు మొదలుపెట్టారు. మా లెక్క మాదే అని భీష్మించడంతో...టెండర్లకు ముందుకొచ్చిన వారు సైతం ఆలోచనలో పడ్డారు. ఇదే సమయంలో పోలీసు, రవాణా అధికారులపై ఒత్తిడి రావడంతో.. ఏపీటీఎస్ ద్వారా టెండర్లు పిలిస్తే మనకు ఎలాంటి తలనొప్పి ఉండబోదని ఖాకీ అధికారులు అటు నెట్టేసి చేతులు దులుపుకున్నారు.