‘పరిపాసు’ విధానానికి సవరణ
ABN , Publish Date - May 24 , 2026 | 04:37 AM
భారీ పారిశ్రామిక రుణాలు, బ్యాంకింగ్ కన్సార్షియం నుంచి తీసుకునే రుణ పత్రాల రిజిస్ట్రేషన్ ఫీజు(పరిపాసు రుసుము) విధానాన్ని ప్రభుత్వం సవరించింది.
‘లోన్‌పై ఫీజు’ చెల్లించే గడువు మూడేళ్లకు పెంచిన ప్రభుత్వం
పారిశ్రామిక వర్గాలకు ఊరట
అమరావతి, మే 23(ఆంధ్రజ్యోతి): భారీ పారిశ్రామిక రుణాలు, బ్యాంకింగ్ కన్సార్షియం నుంచి తీసుకునే రుణ పత్రాల రిజిస్ట్రేషన్ ఫీజు(పరిపాసు రుసుము) విధానాన్ని ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ శనివారం జీవో జారీ చేశారు. దీంతో పారిశ్రామిక రంగానికి ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పాత విధానంలో పారిశ్రామిక వర్గాలు తీసుకున్న లోన్ మొత్తంలో పరిపాసు రుసుము.. 0.5 శాతంగా ఉండేది. దీనికి గరిష్ఠ పరిమితి లేదు. అయితే, పరిశ్రమలు, ఆర్థిక సంస్థల విజ్ఞప్తి మేరకు 2023లో అప్పటి ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. దీని ప్రకారం రుణ మొత్తంలో 0.5 శాతం లేదా గరిష్ఠ పరిమితిని రూ.5 లక్షలుగా నిర్ణయించారు. కానీ, ఈ విధానాన్ని 12 నెలలకు మాత్రమే పరిమితం చేశారు. ఈ గడువు ముగిశాక మళ్లీ లోన్ మొత్తంపై 0.5 శాతం లేదా గరిష్ఠ పరిమితి రూ.5 లక్షలు కట్టించుకునేవారు. దీంతో పెద్ద పరిశ్రమలు, రుణ గ్రహీతలపై ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక రంగానికి ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం, లోన్ మొత్తంలో 0.5 శాతం రుసుమును కొనసాగిస్తూనే గరిష్ఠ పరిమితిని రూ.6 లక్షలకు పెంచారు. కాలపరిమితిని మూడేళ్లుగా నిర్ణయించారు.. దీంతో పరిపాసు రుసుముల చెల్లింపు కాలపరిమితి ఏడాది నుంచి మూడేళ్లకు పెరిగింది.