మా నీళ్లు మీకివ్వడమేంటి?
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:04 AM
కృష్ణా జలాలపై తెలంగాణ చేస్తున్న వాదనల్లో హేతుబద్ధత లేదని ఆంధ్రప్రదేశ్ స్పష్టంచేసింది. కృష్ణా జలవివాదాల ట్రైబ్యునల్-1 తమకు కేటాయించిన నీటిని వాడుకోవడానికి వీల్లేదని...
మీరు వరి వేసుకుంటే.. మేం అపరాలు వేయాలా?.. తెలంగాణ వాదనలపై ఏపీ తీవ్ర అభ్యంతరం
మాకు కేటాయించిన 512 టీఎంసీల్లో మేం 130 టీఎంసీలు వాడుకుంటే చాలా..?
మిగతా 382 టీఎంసీలూ మీకిచ్చేయాలా?.. కృష్ణా జలాలపై తెలంగాణవన్నీ పిచ్చిలెక్కలు
పంటల మార్పిడి పాటించాలని మాకు సలహా ఇవ్వడమేంటి?.. పొరుగు రాష్ట్రం వాదనలో పసలేదు
ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా స్పష్టీకరణ
బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ విచారణ వచ్చే నెల 23, 24, 25కు వాయిదా
అమరావతి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాలపై తెలంగాణ చేస్తున్న వాదనల్లో హేతుబద్ధత లేదని ఆంధ్రప్రదేశ్ స్పష్టంచేసింది. కృష్ణా జలవివాదాల ట్రైబ్యునల్-1 తమకు కేటాయించిన నీటిని వాడుకోవడానికి వీల్లేదని, అందులో కొంతే వాడుకుని మిగతాది తెలంగాణకు ఇవ్వాలని అడగడమేంటని నిలదీసింది. ఆ రాష్ట్రానివన్నీ పిచ్చి లెక్కలేనని తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకానికి సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ ఎదుట మూడో రోజు శుక్రవారం ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా బలమైన వాదనలు వినిపించారు. ‘కృష్ణా జలాల్లో మాకు కేటాయించిన 512 టీఎంసీల్లో పంటల కోసం 130 టీఎంసీలు వినియోగించుకుంటే సరిపోతుందని తెలంగాణ చెబుతున్న లెక్కలన్నీ ఊహాజనితమే. మిగిలిన 382 టీఎంసీలనూ తెలంగాణకే ఇచ్చేయాలని కోరడమేంటి’ అని తీవ్ర అభ్యంతరం తెలియజేశారు.
పోలవరం నుంచి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్నందున ఏపీకి కృష్ణా జలాలు అవసరమే లేదని ఆ రాష్ట్రం చేస్తున్న వాదన అశాస్త్రీయంగా ఉందన్నారు. కృష్ణా జలాలను వినియోగించుకుని అధిక నీటిని వినియోగించే వరిని తాము పండించుకుంటామని.. నీటిని పొదుపు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అపరాలను పండించుకోవాలని తెలంగాణ వితండవాదం చేస్తోందని తెలిపారు. ‘75 శాతం నీటి లభ్యత ఆధారంగా ట్రైబ్యునల్-1 కృష్ణా డెల్టాకు 181.20 టీఎంసీలను కేటాయించింది. ఈ కేటాయింపుల్లో 4 టీఎంసీల నీటి ఆవిరి నష్టాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. ట్రైబ్యునల్ ఒకసారి కృష్ణా డెల్టాకు నీటిని కేటాయించాక.. నదీ పరీవాహక ప్రాంతానికి అవతల (అవుట్‌సైడ్ బేసిన్) అంటూ వాదించడంలో అర్థమే లేదు’ అని స్పష్టంచేశారు.
మేం పొదుపుచేసి తెలంగాణకు ఇస్తున్నాం..
ట్రైబ్యునల్-1 కృష్ణా డెల్టాకు కేటాయించిన 181.20 టీఎంసీల్లో తమ అవసరాలను 152.20 టీఎంసీలకు తగ్గించుకుని సుమారు 29 టీఎంసీలను పొదుపు చేశామని.. అందులో 20 టీఎంసీలను తెలంగాణలోకి బీమా ఎత్తిపోతలకు ఇస్తున్నామని జైదీప్ గుప్తా బ్రిజేశ్ ట్రైబ్యునల్‌కు గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో డెల్టా పరిధిలో ఏపీ మరింత పొదుపు పాటించాలంటూ తెలంగాణ చేస్తున్న వాదనల్లో పసలేదని స్పష్టంచేశారు. ‘మేం రబీలో వరికి బదులుగా చిరుధాన్యాలు, అపరాలు పండించుకోవాలని తెలంగాణ సూచనలు చేయడంలో, ప్రస్తుతం 3.4 లక్షల ఎకరాల్లో పండిస్తున్న అపరాల పంటలను లెక్కల్లోకి తీసుకోవాలనడంలో హేతుబద్ధత లేదు. ఖరీ్‌ఫలో వేసే వరి పంటకు 150 రోజులకు బదులుగా 122 రోజులకే దిగుబడి చేతికి వచ్చే వంగడాలను వేసుకోవాలని ఆ రాష్ట్రం సూచించడం సమంజసంగా లేదు. ట్రైబ్యునల్-1 ఆదేశాలను, కేటాయింపులను పూర్తిగా విస్మరిస్తోంది. మాకు ఐదు లక్షల ఎకరాల్లో గ్రీన్ మాన్యూర్ కోసం 9.48 టీఎంసీలు వినియోగించేందుకు ట్రైబ్యునల్ అవకాశం కల్పించింది. కృష్ణా డెల్టా పరిధిలోని సముద్ర తీర ప్రాంతంలో ఉప్పునీటి కారణంగా కృష్ణా జలాలను తాగునీటి కోసం సరఫరా చేయాలన్న సంగతిని తెలంగాణ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోంది. ప్రస్తుతం డెల్టాలో వేస్తున్న పంటల విధానాన్ని మేం కొనసాగించాల్సిందే. ట్రైబ్యునల్-1 కృష్ణా డెల్టా పరిధిలో రబీ కాలంలో 37,498 ఎకరాల్లో పంటలకు 5.82 టీఎంసీలు కావాలని నిర్ధారించింది. డెల్టా నేల స్వభావం అపరాలు వేసేందుకు సహకరించదు. ఇక్కడ వరి మాత్రమే పండుతుంది. పంటల విధానంలో మార్పులు తెస్తే మా వ్యవసాయానికి, రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది’ అని చెప్పారు.
పంటకాలాన్ని తగ్గించాలా?
ట్రైబ్యునల్-1 పంట కాలాన్ని 180 నుంచి 150 రోజులకు కుదించిందని.. దీనిని ఇంకా కుదించి 122 రోజులకే పరిమితం కావాలన్న తెలంగాణ వాదనలో హేతుబద్ధత ఏమాత్రమూ లేదని జైదీప్ గుప్తా అన్నారు. ‘మా రాష్ట్రంలో పంటల సాగుకు సంబంధించి రైతులు వ్యవసాయ పంచాంగాన్ని అనుసరిస్తారు. ఈ పంచాంగంలో పంట దిగుబడి సమయం 140 నుంచి 155 రోజులు’ అని వివరించారు. తెలంగాణ చెబుతున్నట్లుగా పంటల కోసం 130.19 టీఎంసీలు సరిపోతాయనడం కరెక్టు కాదన్నారు. రాజధాని అమరావతి నగరం అభివృద్ధి కారణంగా వ్యవసాయ విస్తీర్ణం తగ్గి 15.78 టీఎంసీల నీటి వినియోగం ఇప్పటికే తగ్గిందని.. దిగువన పులిచింతల ప్రాజెక్టు ద్వారా 41 టీఎంసీలనే వినియోగించుకుంటున్నామని.. అయినా ట్రైబ్యునల్-1 ఏపీకి కేటాయించిన నీటిని వాడుకోవద్దంటూ తెలంగాణ చేస్తున్న వాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నామని తెలిపారు. తదుపరి వాదనలను వచ్చే నెల 23, 24, 25 తేదీల్లో వింటామంటూ బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ విచారణను వాయిదా వేసింది.