యూనివర్సిటీల ప్రక్షాళన
ABN , Publish Date - Mar 03 , 2026 | 03:40 AM
ఉన్నత విద్యాశాఖను ప్రక్షాళన చేసిన ప్రభుత్వం తాజాగా విశ్వవిద్యాలయాలపై దృష్టి సారించింది.
మొత్తం పాలక మండళ్లను మార్చేయాలని సర్కారు నిర్ణయం
విధాన నిర్ణయాలకు అడ్డంకిగా ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ మండళ్లు
ఈ నెలలోనే కొత్త ఈసీల ఏర్పాటు కొన్ని వర్సిటీల్లో రిజిస్ర్టార్లు కూడా
జేఎన్‌టీయూల మధ్య సిబ్బంది విభజన
అమరావతి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యాశాఖను ప్రక్షాళన చేసిన ప్రభుత్వం తాజాగా విశ్వవిద్యాలయాలపై దృష్టి సారించింది. బోధన, పాలనాపరమైన విధాన నిర్ణయాలకు అడ్డంకిగా మారిన పాలక మండళ్లను మార్చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెలలోనే అన్ని యూనివర్సిటీలకు కొత్త ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల(ఈసీ)ను నియమించనుంది. మంత్రి లోకేశ్ సూచనలకు అనుగుణంగా ఉన్నత విద్యాశాఖ కొత్త ఈసీలను నియమిస్తుంది. 2023, సెప్టెంబరులో వైసీపీ ప్రభుత్వం అన్ని యూనివర్సిటీలకు ఈసీలను నియమించింది. వీటి కాలపరిమితి మరో ఆరు నెలలు ఉంది. కాగా, ప్రభుత్వం మారిన తర్వాత చాలా యూనివర్సిటీల్లో ఈసీ సమావేశాలు నిర్వహించలేదు. నిబంధనల ప్రకారం మూడు నెలలకోసారి ఈసీ సమావేశాలు జరగాల్సి ఉండగా, రెండేళ్లు అవుతున్నా చాలా చోట్ల సమావేశాలు నిర్వహించకపోవడం గమనార్హం. ఈసీ ఆమోదం లేకుండా వార్షిక బడ్జెట్ ఖర్చు చేయకూడదు. అయినా ఈసీ ఆమోదం లేకుండానే ఖర్చు చేస్తున్నారు. అలాగే బోధనా పరమైన మార్పులకూ ఈసీ ఆమోదం లభించడం లేదు. మరోవైపు ఈసీల్లో ప్రముఖ పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పించాలని మంత్రి లోకేశ్ సూచించారు. అలాగే, గత ప్రభుత్వంలో నియమితులైన రిజిస్ర్టార్‌లు, రెక్టార్లలో కొందరిని మార్చాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది.
సిబ్బంది విభజనకు ప్రతిపాదన
జేఎన్‌టీయూ కాకినాడ, జేఎన్‌టీయూ గురజాడ(విజయనగరం) మధ్య సిబ్బందిని విభజించాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. దీనిపై ప్రతిపాదనలు రూపొందిస్తోంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదన పెట్టి ఆమోదం పొందిన వెంటనే సిబ్బంది విభజనకు చర్యలు ప్రారంభించనుంది. 2022లో జేఎన్‌టీయూ గురజాడ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి జేఎన్‌టీయూ కాకినాడ సిబ్బందే అక్కడ పనిచేస్తున్నారు.