వ్యాజ్యంలో సాంకేతిక లోపాలు సరిదిద్దాం
ABN , Publish Date - May 26 , 2026 | 05:35 AM
ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ ఈ-చలాన్ల కుంభకోణం కేసుకు సంబంధించి కొన్ని సాంకేతిక లోపాలు(డేటా ఎర్రర్స్) సరిదిద్దామని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం నివేదించింది.
‘ఈ-చలాన్’ కుంభకోణం కేసులో సుప్రీంకు ఏపీ నివేదన
న్యూఢిల్లీ, మే 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ ఈ-చలాన్ల కుంభకోణం కేసుకు సంబంధించి కొన్ని సాంకేతిక లోపాలు(డేటా ఎర్రర్స్) సరిదిద్దామని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం నివేదించింది. ఈ క్రమంలో ప్రతివాదిగా ఉన్న డేటా ఇవాల్వ్ సంస్థకు కోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర పోలీసు శాఖకు ఈ-చలాన్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ను సరఫరా చేసి, నిర్వహించేందుకు 2018లో ‘డేటా ఇవాల్వ్’ సంస్థకు మూడేళ్ల కాల పరిమితితో కాంట్రాక్టు దక్కింది. ఈ ఒప్పందం గడువు 2021 డిసెంబరు 31తో ముగిసింది. తర్వాత కాంట్రాక్టును పునరుద్థరించలేదు. అయినప్పటికీ సదరు సంస్థ అనధికారికంగా ఆ సాఫ్ట్‌వేర్ వ్యవస్థను నిర్వహిస్తూ వచ్చిందని ప్రభుత్వం ఆరోపించింది. ట్రాఫిక్ చలాన్ల రూపంలో వసూలైన సుమారు రూ.37 కోట్ల ప్రజాధనాన్ని దారి మళ్లించిందని క్రిమినల్ కేసులు నమోదు చేసింది. అయితే పెండింగ్ బిల్లుల చెల్లింపులు, సేవల కొనసాగింపు తదితర అంశాల్లో ప్రభుత్వంతో వివాదాలు తలెత్తాయని, వీటి పరిష్కారానికి ఆర్బిట్రేటర్‌ను నియమించాలని కోరుతూ సదరు సంస్థ గతంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. వివాద పరిష్కారానికి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయిని ఏకసభ్య ఆర్బిట్రేటర్‌గా ఏపీ హైకోర్టు నియమించింది. ఈ నియామక ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 13న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత నెల 24న ఇది విచారణకు వచ్చినప్పుడు హైకోర్టు చేపట్టిన ఆర్బిట్రేటర్ నియామకంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. డేటా ఇవాల్వ్ సంస్థకు నోటీసులు జారీచేసింది. సోమవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీలతో కూడిన ధర్మాసనం ఎదుట మళ్లీ ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. వ్యాజ్యంలో ఉన్న సాంకేతిక లోపాలను సరిదిద్దామని, దీనిపై ప్రతివాదిగా ఉన్న డేటా ఇవాల్వ్‌కు మళ్లీ నోటీసులివ్వాలని రాష్ట్రప్రభుత్వ న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు.