రాష్ట్రంలో మళ్లీ కరోనా అలజడి
ABN , Publish Date - Jul 17 , 2026 | 04:10 AM
చాలా రోజుల విరామం తర్వాత రాష్ట్రంలో కొవిడ్ కేసులు నెమ్మదిగా పెరుగున్నాయి. రెండు వారాల వ్యవధిలో 12 కేసులు వెలుగులోకి రాగా.. వారిలో ఇప్పటివరకూ నలుగురు మరణించారు.
12 కేసులు.. నలుగురి మృతి
2 వారాల నుంచి వెలుగు చూస్తున్న కేసులు
కడపలో 8, విశాఖ, కాకినాడ, గుంటూరుల్లో 4
వారిలో నలుగురి మృతితో ఆరోగ్య శాఖ అప్రమత్తం
బోధనాస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు ఆదేశం
అమరావతి, విశాఖపట్నం, మంగళగిరి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): చాలా రోజుల విరామం తర్వాత రాష్ట్రంలో కొవిడ్ కేసులు నెమ్మదిగా పెరుగున్నాయి. రెండు వారాల వ్యవధిలో 12 కేసులు వెలుగులోకి రాగా.. వారిలో ఇప్పటివరకూ నలుగురు మరణించారు. బుధవారం కడపలో ఒకరు, గురువారం కాకినాడలో మరొక బాలిక కరోనాతో మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో కడపలో అత్యధికంగా 8, గుంటూరు జిల్లాలో రెండు, విశాఖపట్నం, కాకినాడలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. విశాఖపట్నంలో ఒకటి, గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌లో 2 కేసులు హోం ఐసొలేషన్‌లో ఉండగా.. మరో ఇద్దరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 2020-22 మధ్య ప్రపంచాన్ని వణికించిన కరోనా.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. గత నాలుగేళ్లల్లో అక్కడక్కడా ఒకటి, రెండు కేసులు మినహా... పదుల సంఖ్యలో వెలుగులోకి వచ్చిన దాఖలాలు లేవు. గత రెండు వారాల వ్యవధిలో కడప, రాజంపేట, విశాఖపట్నం, మంగళగిరి, కాకినాడలో వరుసగా కేసులు బయటపడుతుండడంతో మళ్లీ అలజడి మొదలైంది. వారం క్రితం కడప, రాజంపేటలో 8 పాజిటివ్‌లు నమోదయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమించడంతో తిరుపతికి పంపించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. మరొకరు కడప నుంచి తమిళనాడులోని సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. బుధవారం మరో వ్యక్తి కడప ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మృతిచెందారు. తాజా మరణంతో కడపలో కరోనా బారినపడిన 8మందిలో ముగ్గురు మృతి చెందినట్టయింది. కాగా, జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా 339 కొవిడ్ కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. జూన్ 26 నుంచి జూలై 16 వరకు రాష్ట్రంలో 67 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్టు పేర్కొంది. 5 శాంపిల్స్‌ను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపినట్టు తెలిపింది.
ఆరోగ్యశాఖ అప్రమత్తం..
రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. స్టేట్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్(ఎస్‌పీపీఎం)లను సిద్ధం చేసింది. ఈ బృందాలు పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతంలో పర్యటించేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే.. జిల్లాల్లో అత్యవసర ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లను ప్రతిచోటా కనీసం 10 బెడ్స్ ఉండేలా ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేయాలని సూచించింది. కొవిడ్‌కు సంబంధించిన కిట్లు, మాస్క్‌లు, ఇతర వైద్య పరికరాలు సమకూర్చుకోవాలని, ర్యాపిడ్ టెస్ట్‌లు చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది.
దీర్ఘకాలిక సమస్యలు ఉంటే మరింత జాగ్రత్త
కరోనా కేసులు పెరగడంతో బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలున్నవారు వారు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యశాఖ సూచించింది. రెండు వారాల వ్యవధిలో చనిపోయిన నలుగురిలోనూ ఈ సమస్యలున్నట్లు గుర్తించినట్టు పేర్కొంది. కడప నుంచి తమిళనాడులోని సీఎంసీకి వెళ్లి అక్కడ చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తికి నిమోనియాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలున్నట్లు గుర్తించారు. అలానే తిరుపతి, కడపలో మరణించిన ఇద్దరికి కూడా షుగర్, బీపీ, ఇతర అనారోగ్య సమస్యలున్నట్లు వైద్యులు తెలిపారు. కాకినాడలో మరణించిన పాపకు కూడా కిడ్నీ సంబంధిత సమస్యలున్నట్లు గుర్తించారు. షుగర్, బీపీ ఉన్నవారికి జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తితే వెంటనే ర్యాపిడ్ టెస్టులు చేయాలని ఆరోగ్యశాఖ ఆదేశించింది.
విశాఖలో కరోనా కేసు..
విశాఖపట్నంలో 33 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. ఆయన కొద్దిరోజుల కిందట హైదరాబాద్ వెళ్లి వచ్చారు. అప్పటి నుంచి జ్వరం, తలనొప్పితో బాధ పడుతున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించారు. పాజిటివ్‌గా తేలడంతో ఆయన భార్యకు కూడా పరీక్ష నిర్వహించారు. ఆమెకు నెగిటివ్ వచ్చింది.