Swarna Andhra Vision: ఇక స్వర్ణ గ్రామం.. స్వర్ణ వార్డు!
ABN , Publish Date - Jan 14 , 2026 | 04:10 AM
రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు స్వర్ణగ్రామం, స్వర్ణవార్డుగా మారాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆర్డినెన్సు జారీ చేశారు.
ఆర్డినెన్సు జారీ చేసిన గవర్నర్ నజీర్
మారనున్న సచివాలయాల ముఖచిత్రం
ప్రజలకు మరింత పారదర్శక సేవలు
అమరావతి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు స్వర్ణగ్రామం, స్వర్ణవార్డుగా మారాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆర్డినెన్సు జారీ చేశారు. ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల చట్టం-2023ను సవరిస్తూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను ఆయన ఆమోదించారు. డిసెంబరు 30న జరిగిన మంత్రివర్గ సమావేశంలో చట్ట సవరణ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. స్వర్ణాంధ్ర లక్ష్యసాధనలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలకపాత్ర పోషిస్తాయని, దానికి అనుగుణంగా కార్యనిర్వాహకుల పాత్రలు, బాధ్యతలను సవరించాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలోనే గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్చాలని మంత్రి మండలి అభిప్రాయపడింది. ఈ ఆర్డినెన్సు ప్రకారం జీఎ్‌సడబ్ల్యూఎస్ శాఖ పేరును ఇక నుంచి స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు శాఖగా పిలుస్తారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు, అధికారిక లెటర్ హెడ్లను తక్షణమే ఈ కొత్త పేర్లకు అనుగుణంగా మా ర్చాలని ప్రభుత్వం ఇటీవల ము న్సిపల్, పంచాయతీరాజ్ శాఖలను ఆదేశించింది. సంస్కరణల్లో భాగంగా సచివాలయ వ్యవస్థకు సరికొత్త గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మార్పు కేవలం పేరుకే పరిమితం కాకుండా, ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందించడమే ఉద్దేశమని సీఎం చంద్రబాబు తెలిపారు.