Share News

జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాలకు షెడ్యూల్‌

ABN , Publish Date - May 23 , 2026 | 05:00 AM

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వివిధ స్థాయిల్లో నిర్వహించే జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్స్‌ సమావేశాలకు ప్రభుత్వం ప్రత్యేక షెడ్యూల్‌ నిర్ణయించింది.

జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాలకు షెడ్యూల్‌

అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వివిధ స్థాయిల్లో నిర్వహించే జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్స్‌ సమావేశాలకు ప్రభుత్వం ప్రత్యేక షెడ్యూల్‌ నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు జూన్‌ 1 నుంచి 15వ తేదీలోపు మొదటి సమావేశం నిర్వహించాలని, అక్టోబరు 1 నుంచి 15వ తేదీ నాటికి రెండో సమావేశం, 2027 ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ నాటికి మూడో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. అలానే హెచ్‌వోడీలు జూన్‌ 15 నుంచి 30 నాటికి తొలి సమావేశం, అక్టోబరు 15 నుంచి 30వ తేదీ నాటికి రెండో సమావేశం, ఫిబ్రవరి 15 నుంచి 28వ తేదీ నాటికి మూడో సమావేశం పూర్తి చేయాలి. సచివాలయంలోని ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు.. జూలై 1 నుంచి 15 నాటికి మొదటి సమావేశం, నవంబరు 1 నుంచి 15 నాటికి రెండో సమావేశం, మార్చి 1 నుంచి 15వ తేదీ నాటికి మూడో సమావేశం నిర్వహించాలని షెడ్యూల్‌ ప్రకటించారు. జిల్లా కలెక్టర్లు, హెచ్‌వోడీలు, కార్యదర్శులు నిర్వహించే సమావేశాలకు సంబంధించిన మినిట్స్‌ను కచ్చితంగా సాధారణ పరిపాలన శాఖకు పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - May 23 , 2026 | 05:01 AM