సమ్మక్క బ్యారేజీ నుంచి అనుసంధానానికి నో
ABN , Publish Date - May 23 , 2026 | 05:28 AM
తెలంగాణలోని తుపాకులగూడెం బ్యారేజీ (సమ్మక్క సాగర్ ప్రాజెక్టు) నుంచి గోదావరి జలాలను కావేరికి తరలిస్తే.. దిగువన ఉన్న తమ పోలవరం ప్రాజెక్టుకు నీరు అందదని ఆంధ్రప్రదేశ్ స్పష్టంచేసింది.
పోలవరం ప్రాజెక్టుకు నీరు అందదు
ఇప్పటికే ఎన్‌డబ్ల్యూడీఏకి ఏపీ స్పష్టం
మా రాష్ట్రం నుంచయితేనే కావేరి లింకుకు మద్దతు
ఇటీవల జలశక్తి మంత్రికి తేల్చిచెప్పిన సీఎం
అమరావతి, మే 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని తుపాకులగూడెం బ్యారేజీ (సమ్మక్క సాగర్ ప్రాజెక్టు) నుంచి గోదావరి జలాలను కావేరికి తరలిస్తే.. దిగువన ఉన్న తమ పోలవరం ప్రాజెక్టుకు నీరు అందదని ఆంధ్రప్రదేశ్ స్పష్టంచేసింది. పైగా 300 టీఎంసీల లోటు ఏర్పడుతుందని జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)కు గత ఏడాది మార్చి 19వ తేదీనే తెలియజేసింది. ఇప్పటికీ అదే వైఖరితో ఉన్నామని జలవనరుల శాఖ స్పష్టంచేసింది. ఏపీలో పోలవరం-ప్రకాశం బ్యారేజీ-బొల్లాపల్లి క్రాస్ రెగ్యులేటర్-సోమశిల మీదుగా కావేరి అనుసంధానానికి మాత్రమే ఆమోదం తెలుపుతామని ఈ నెల 8వ తేదీన కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పష్టం చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. ‘తెలంగాణ ప్రతిపాదిస్తున్నట్లుగా తుపాకులగూడెం నుంచి కావేరికి తరలించేందుకు గోదావరిలో మిగులు జలాలే లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 75 శాతం డిపెండబిలిటీ కింద 862.3 టీఎంసీల గోదావరి జలాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 1162.91 టీఎంసీలు అవసరం. ఈ విధంగా చూస్తే 300.60 టీఎంసీల లోటు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ నుంచి కావేరి అనుసంధానం సాధ్యం కాదు. ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించిన నాగార్జునసాగర్-సోమశిల-ఆరణియార్ రిజర్వాయర్ల మీదుగా కావేరికి అనుసంధానం చేయాలంటే.. రుతుపవనాల సమయంలో 4189 ఎంసీఎం జలాలు అవసరం’ అని ఏపీ ఇదివరకే స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ-బొల్లాపల్లి-సోమశిల-కావేరి అనుసంధానం చేయాలన్న వైఖరికే కట్టుబడి ఉన్నామని కేంద్రానికి తేల్చిచెప్పినట్లు జలవనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి.