Share News

భారీగా పెరిగిన రిజిస్ర్టేషన్ల ఆదాయం

ABN , Publish Date - Apr 29 , 2026 | 05:01 AM

గత ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ర్టేషన్ల ఆదాయం భారీగా పెరిగింది. బడ్జెట్‌ అంచనాలను 98.4ు సాధించింది. 2024-25లో వచ్చిన ఆదాయం కంటే 25శాతం ఎక్కువ ఆదాయం వచ్చింది.

భారీగా పెరిగిన రిజిస్ర్టేషన్ల ఆదాయం

  • 2025-26లో 25 శాతం పెరిగిన రాబడి

  • 11 ఏళ్లలో 2,874 కోట్ల నుంచి11,056 కోట్లకు పెరుగుదల

అమరావతి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): గత ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ర్టేషన్ల ఆదాయం భారీగా పెరిగింది. బడ్జెట్‌ అంచనాలను 98.4ు సాధించింది. 2024-25లో వచ్చిన ఆదాయం కంటే 25శాతం ఎక్కువ ఆదాయం వచ్చింది. రిజిస్ర్టేషన్ల శాఖ చరిత్రలో ఇదే అత్యంత బలమైన వృద్ధి. ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకృత, మెరుగైన పాలనా విధానాల ఫలితంగానే రాబడులు విపరీతంగా పెరిగాయని ఆ శాఖ మంగళవారం తెలిపింది. 2024-25లో రూ.8,847.27 కోట్ల ఆదాయం రాగా, 2025-26లో రూ.11,056.99 కోట్ల ఆదాయం వచ్చింది. 2014-15లో రిజిస్ర్టేషన్ల శాఖ వార్షిక ఆదాయం రూ.2,874.44 కోట్లు కాగా 2025-26 నాటికి రూ.11,056.99 కోట్లకు పెరిగింది. రిజిస్ర్టేషన్ల ఆదాయంలో 2025 ఏప్రిల్‌లో 36.61 శాతం, మేలో 57.31, జూన్‌లో 46.46, జూలైలో 25.15, ఆగస్టులో 3, సెప్టెంబరులో 54.85, అక్టోబరులో 18.22, నవంబరులో 26.65 శాతం వృద్ధి నమోదైంది. కాగా డిసెంబరులో 0.21 శాతం ఆదాయం తగ్గింది. 2026 జనవరిలో 28.67 శాతం, ఫిబ్రవరిలో 20.79 శాతం, మార్చిలో 14.72 వృద్ధి నమోదైంది. ప్రజానుకూల రిజిస్ర్టేషన్‌ విధానాలు, అన్ని స్థాయిల్లో సమగ్ర పర్యవేక్షణ, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో చురుకుదనం, డిజిటల్‌, పరిపాలనా సంస్కరణల సమర్థ అమలు వల్ల రిజిస్ర్టేషన్ల ఆదాయంలో పెరుగుదల సాధ్యమైందని అధికారులు పేర్కొన్నారు. ఇది సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు, జిల్లా పరిపాలన, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయ కృషిక దక్కిన ఫలితమని రిజిస్ర్టేషన్లు, స్టాంపులు శాఖ కమిషనర్‌, ఐజీ బీఆర్‌ అంబేడ్కర్‌ చెప్పారు. ప్రజల సౌకర్యం కోసం డిజిటల్‌ సంస్కరణలు, ప్రజాభిప్రాయం ఆధారంగా మార్పులు, ఆటోమ్యుటేషన్‌ ప్రక్రియ, స్లాట్‌ బుకింగ్‌ విధానం, ఆధార్‌ ఆధారిత ఓటీపీ ధ్రువీకరణ వంటి కార్యక్రమాలు సేవలను సులభతరం చేశాయని తెలిపారు.

Updated Date - Apr 29 , 2026 | 05:01 AM