Share News

పన్ను ఆదాయంలో భారీ వృద్ధి

ABN , Publish Date - May 02 , 2026 | 04:46 AM

ఏప్రిల్‌లో పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి. పన్ను విభాగాలు రూ. 5,542.7 కోట్ల ఆదాయాన్ని సాధించాయని రాష్ట్ర పన్నుల చీఫ్‌ కమిషనర్‌ అహ్మద్‌బాబు శుక్రవారం...

పన్ను ఆదాయంలో భారీ వృద్ధి

  • ఏప్రిల్‌లో రాబడి రూ. 5,542 కోట్లు

  • జీఎస్టీ అమల్లోకి వచ్చాక నెలవారీ వసూళ్లలో ఇదే అత్యధికం

  • 2025 కంటే 12.08 శాతం పెరుగుదల

అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): ఏప్రిల్‌లో పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి. పన్ను విభాగాలు రూ. 5,542.7 కోట్ల ఆదాయాన్ని సాధించాయని రాష్ట్ర పన్నుల చీఫ్‌ కమిషనర్‌ అహ్మద్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి నమోదైన అత్యధిక నెలవారీ వసూలు ఇదే. 2025 ఏప్రిల్‌లో వచ్చిన ఆదాయం కంటే ఇది రూ. 598.78 కోట్లు ఎక్కువ. మొత్తంగా ఏప్రిల్‌లో వాణిజ్యపన్నుల వసూళ్లలో 12.08 శాతం వృద్ధి నమోదైంది. జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా ఏడాదికి రూ. 8,000 కోట్ల ఆదాయం పెరగవచ్చని అంచనా వేయగా, గత ఆర్థిక సంవత్సరం చివరి 6 నెలల్లోనే రూ. 4,500 కోట్లు వచ్చాయి. ఏఐ ఆధారిత డేటా విశ్లేషణలు, ఏఐ ఆధారిత పరిశీలన, ఏఐ ఆధారిత ఐజీఎస్టీ రివర్సల్స్‌, యూపీఐ ఆధారిత విశ్లేషణల అమలు, డిస్కమ్‌ ఆధారిత రిజిస్ర్టేషన్‌ ధ్రువీకరణ, ఆధార్‌ అనుసంధానంతో వృత్తి పన్ను వసూళ్లు చేశారు. 2025 ఏప్రిల్‌లో నికర జీఎస్టీ రూ. 3,554.27 కోట్లు రాగా, 2026 ఏప్రిల్‌లో రూ. 3,796.91 కోట్లు వచ్చింది. 6.83 శాతం వృద్ధి నమోదైంది. 2026 ఏప్రిల్‌లో సెస్‌ మినహా స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 4,323.07 కోట్లు వసూలయ్యాయి. ఐజీఎస్టీ సెటిల్మెంట్‌ 12.97 శాతం వృద్ధితో రూ. 2,194.84 కోట్లు వసూలైంది. పెట్రో వ్యాట్‌ 26.72 శాతం వృద్ధితో రూ. 1,613.36 కోట్లు, వృత్తి పన్ను రూ. 42.9 కోట్లు వసూలైంది. మద్యం వ్యాట్‌ రూ. 77 కోట్ల నుంచి రూ. 83 కోట్లకు పెరిగింది. 7.97 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఆదాయం 2025 ఏప్రిల్‌లో రూ. 4,946 కోట్లు ఉండగా, ఏప్రిల్‌ 2026 నాటికి 12.08 శాతం వృద్ధితో రూ. 5,543 కోట్లకు చేరుకుంది. పన్ను పరిధి పెంచడానికి, లీకేజీలు అరికట్టడానికి ప్రభుత్వం ఏఐ సాంకేతికతను వినియోగిస్తోంది. డేటాతోనే నిర్మాణ రంగంలో ఎగవేతలు గుర్తించారు.

Updated Date - May 02 , 2026 | 04:46 AM