కరెంటు వాడకంలో రికార్డు!
ABN , Publish Date - May 22 , 2026 | 04:49 AM
మండుతున్న ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. ప్రజలు దాదాపుగా ఇళ్లకే పరిమితమవుతున్నారు.
285 మిలియన్ యూనిట్లు దాటిన వినియోగం
ఏపీ విద్యుత్తు శాఖ చరిత్రలో ఇదే అత్యధికం
మార్చి 7న గరిష్ఠంగా 274.6 ఎంయూల వాడకం
థర్మల్, హైడల్ కేంద్రాల్లో రికార్డు స్థాయిలో ఉత్పత్తి
అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): మండుతున్న ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. ప్రజలు దాదాపుగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఎండల తీవ్రతకు అనుగుణంగా గృహ వినియోగం భారీగా ఉండటంతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ గత రెండు రోజులుగా గణనీయంగా పెరిగింది. గురువారం రాష్ట్ర విద్యుత్తు శాఖ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 285 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదైంది. బుధవారం 278.9 ఎం.యూ. విద్యుత్తు వినియోగించారు. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో గరిష్ఠంగా 256 ఎంయూ వినియోగం మాత్రమే నమోదైంది. ఈ ఏడాది మార్చి 7న గరిష్ఠంగా 274.6 ఎంయూలు వినియోగించారు. మార్చి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు 35డిగ్రీల పైబడడం విద్యుత్తు వినియోగం భారీగా పెరగడానికి కారణమని అధికారులు అన్నారు. గత ఐదేళ్లలో ఏప్రిల్, మే నెలల్లో గరిష్ఠ విద్యుత్తు వినియోగం సగటున 256 మిలియన్ యూనిట్లు మాత్రమే. దీని ఆధారంగా ఈ ఏడాది మేలో గరిష్ఠ డిమాండ్ 280 ఎంయూ ఉండొచ్చని అంచనా వేయగా, గురువారం 285 ఎంయూను తాకింది. ఇదే పరిస్థితి కొనసాగితే మే నెలాఖరు నాటికి 300 ఎంయూలకు చేరినా ఆశ్చర్యం లేదని అధికారులు చెబుతున్నారు. అంచనాలకు మించి వినియోగం జరుగుతున్నా ఎక్కడా అంతరాయాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జెన్కో ఆధ్వర్యంలోని థర్మల్, హైడల్ కేంద్రాలు రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి చేస్తున్నాయి.