Share News

ఏపీకి అదనంగా 24 వేల టన్నుల గ్యాస్‌

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:06 AM

ప్రస్తుతం రాష్ట్రంలో 15 రోజులకు సరిపడా వంట గ్యాస్‌ (ఎల్పీజీ) నిల్వలున్నాయని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

ఏపీకి అదనంగా 24 వేల టన్నుల గ్యాస్‌

  • ప్రజలకు ఇబ్బందుల్లేకుండా గ్యాస్‌ పంపిణీకి చంద్రబాబు ఆదేశం

  • రాష్ట్రంలో 15 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు

  • ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

  • పైప్డ్‌ గ్యాస్‌ నెట్‌వర్క్‌ పెంచేందుకు కార్యాచరణ

  • గ్యాస్‌ సరఫరాపై రెండోరోజూ సీఎం సమీక్ష

అమరావతి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం రాష్ట్రంలో 15 రోజులకు సరిపడా వంట గ్యాస్‌ (ఎల్పీజీ) నిల్వలున్నాయని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14 వేల టన్నుల స్టాక్‌ ఉండగా.. అదనంగా మరో 24 వేల టన్నుల ఎల్పీజీ విశాఖలో అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఎల్పీజీ నిల్వలు, సరఫరా, సిలిండర్ల పంపిణీ తదితర అంశాలపై సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ నుంచి రెండోరోజైన మంగళవారం కూడా ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులూ లేవని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ఈకేవైసీ, ఓటీపీల సాయంతో గ్యాస్‌ సిలిండర్లు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా గ్యాస్‌ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్యాస్‌ కంపెనీలు స్వల్ప కాలికంగా ఉత్పత్తి పెంచడంతోపాటు పంపిణీ కూడా మెరుగ్గా ఉండేలా చూడాలన్నారు. గ్యాస్‌ సిలిండర్ల డెలివరీ సమయాన్ని 1.5 రోజులకు కుదించాలని సీఎం చెప్పారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రజలకు తక్షణమే అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాలపైనా అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఇండక్షన్‌ స్టౌల స్టాక్‌ లభ్యతను కూడా తెలుసుకోవాలని సూచించారు.


త్వరలో ‘ఏపీ వన్‌’ యాప్‌ సేవలు

ట్రాపిక్‌ నిబంధనల ఉల్లంఘనపై వాహనదారులకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. సిటిజన్‌ సేఫ్టీ అవేర్‌నెస్‌ కింద వారికి సంక్షిప్త సమాచారాన్ని పంపించాలన్నారు. వినియోగదారులు విద్యుత్తు బిల్లులను యాప్‌ లేదా వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. దీనికోసం రూపొందిస్తున్న ‘ఏపీ వన్‌’ యాప్‌ను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. వేసవిలో అవేర్‌ ద్వారా సమాచారం తీసుకుని తాగునీరు, వడగాలులు, పశుగ్రాసం సహా వివిధ అంశాలపై ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళలపై నేరాలు, డ్రగ్స్‌ నియంత్రణ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను సాధించేలా, గ్రామాల్లో వ్యర్థాలను తొలగించి చెత్తను వర్గీకరించేలా ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. భవన నిర్మాణాల నుంచి వచ్చే వ్యర్థాలు సర్క్యులర్‌ ఎకానమీకి వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. సీఎస్‌ సాయిప్రసాద్‌, ఉన్నతాధికారులు ఎంటీ కృష్ణబాబు, శశిభూషణ్‌ కుమార్‌, సురేశ్‌ కుమార్‌, హరిజవహర్‌లాల్‌, ఓఎన్‌జీసీ, గెయిల్‌, వివిధ పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


పైప్డ్‌ గ్యాస్‌ నెట్‌వర్క్‌ విస్తరణకు చర్యలు

ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా పైప్డ్‌ గ్యాస్‌ కనెక్షన్లు, నెట్‌వర్క్‌ పెంపుపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఏపీలో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును పైప్డ్‌ నెట్‌వర్క్‌ ద్వారా ప్రజలకు సరఫరా చేసే అంశంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. సీఎన్‌జీ, పీఎన్‌జీ వినియోగానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. తక్షణం చేయగలం అన్న ప్రాంతాల్లో పీఎన్‌జీ సరఫరాకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఏజీ అండ్‌ పీ, భాగ్యనగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌, జీజీపీఎల్‌, ఐవోసీఎల్‌, మేఘ గ్యాస్‌ కంపెనీలు సహజ వాయువును సరఫరా చేస్తున్నాయని అధికారులు వివరించారు. 1.68 లక్షల డొమెస్టిక్‌ కనెక్షన్లు ఇచ్చేందుకు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ుుఖ్యమంత్రి స్పందిస్తూ.. సీఎన్‌జీ, పీఎన్‌జీ నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేయాలని ఆదేశించారు. అమరావతితో పాటు పట్టణ ప్రాంతాల్లో పైప్డ్‌ గ్యాస్‌ నెట్‌వర్క్‌ పెంచుకునే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - Mar 18 , 2026 | 04:08 AM