ఉపాధిలో ఏపీ టాప్
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:38 AM
ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధుల పనుల్లో ఏపీ టాప్‌లో నిలిచింది. ఆరేళ్ల తర్వాత జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్ఠ మళ్లీ పుంజుకుంది.
ఆరేళ్ల తర్వాత మెటీరియల్ పనుల్లో మొదటి స్థానం
ఇప్పటి వరకు రూ.1,884 కోట్ల బిల్లులు అప్‌లోడ్
ఇప్పటికే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్‌లో నం.1.. ఢిల్లీలో తిరిగి పుంజుకుంటున్న రాష్ట్ర ప్రతిష్ఠ
ఉపాధి పథకాన్ని భ్రష్ఠు పట్టించిన వైసీపీ ప్రభుత్వం.. దొంగ మస్టర్లు, నిధుల దుర్వినియోగంతో తలవంపులు
అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధుల పనుల్లో ఏపీ టాప్‌లో నిలిచింది. ఆరేళ్ల తర్వాత జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్ఠ మళ్లీ పుంజుకుంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఉపాధి పథకానికి సంబంధించి అన్నీ విభాగాల్లోనూ రాష్ట్రమే ముందుండేది. జగన్ సర్కారు వచ్చిన తర్వాత ఈ పథకాన్ని భ్రష్టు పట్టించారు. దొంగ మస్టర్లుకు అవకాశం ఇవ్వడం, పనులు చేయకుండానే వైసీపీ కార్యకర్తలు మెటీరియల్ నిధులు పంచుకోవడం తదితరాలతో ఢిల్లీలో రాష్ట్ర ప్రతిష్ఠ మసకబారింది. కేంద్ర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తే ఇక్కడి అధికారులు సమాధానం చెప్పలేని దుస్థితి ఉండేది. ఒక దశలో రాష్ట్రానికి ఉపాధి పనిదినాలు నిలిపేశారు. ఏ నిధులు విడుదల చేయాలన్నా అనేక తనిఖీలు నిర్వహించి మంజూరు చేసేవారు. అయితే కూటమి సర్కారు వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రోత్సాహంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, కమిషనర్ కృష్ణతేజ గ్రామీణాభివృద్ధి, పీఆర్ శాఖలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేశారు.
స్వర్ణ పంచాయతీతో సరికొత్త రికార్డు
పంచాయతీల్లో పారదర్శకత పెంచి ఆదాయం పెంచేందుకు రూపొందించిన సరికొత్త స్వర్ణ పంచాయతీ పోర్టల్ అద్భుత ఫలితాలు సాధిస్తోంది. పన్ను లు చెల్లిస్తే ఎవరికి చేరతాయో తెలియని స్థితి నుంచి ఆన్‌లైన్ ద్వారా పన్ను చెల్లిస్తే వెంటనే బిల్లు మొబైల్‌కు వచ్చే పరిస్థితి ఏర్పడింది. 88 లక్షల అసె్‌సమెంట్లతో పంచాయతీల ఆదాయం రూ.450 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు చేరింది. ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా పన్నులు జమయ్యాయి. ఆర్థిక సంఘం నిధుల వ్యయం, సిబ్బంది డేటాబేస్‌ను పోర్టల్‌లో ఉంచడం ద్వారా పంచాయతీరాజ్ శాఖ సరికొత్త చరిత్రను సృష్టించనుంది. స్వర్ణ పంచాయతీల విధానం ఇప్పుడు దేశానికి ఆదర్శంగా మారింది. మరోవైపు ఘన వ్యర్థాలను సంపదగా మార్చే వినూత్న కార్యక్రమానికి ఈ శాఖ శ్రీకారం చుట్టింది. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ప్రతిఫలంగా కుటుంబానికి నిత్యావసరాలు అందజేసేందుకు గ్రామాల్లో స్వర్ణ రథాలు సంచరిస్తున్నాయి. అడవితల్లి బాట లాంటి పథకాల ద్వారా ఏజెన్సీలో సిమెంట్ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు.
ఆర్‌జీఎస్ఏలోనూ టాప్‌లోకి
గత టీడీపీ హయాంలో ప్రతి శాఖకు సంబంధించి లక్ష్యాలు సాధించడంలో ముందున్న రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం వెనుక వరుసలో నిలబెట్టింది. రాష్ట్ర వాటా ఇవ్వకుండా పలు కేంద్ర పథకాలను అమలు కానీయకుండా అడ్డుకున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల శిక్షణకు ఉద్దేశించిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్(ఆర్‌జీఎ్‌సఏ)ను కూడా అటకెక్కించారు. ఒక్క ప్రజాప్రతినిధికి కూడా శిక్షణ ఇవ్వకపోవడంతో అప్పట్లో రాష్ట్రానికి ఈ పథకం కింద కేంద్రం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. వైసీపీ హయాంలో ఆర్‌జీఎ్‌సఏ అమల్లో ఏపీ 24వ స్థానంలో నిలిచింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారుల నిరంతర కృషితో ఇప్పుడు ఈ పథకం కింద శిక్షణ ఇవ్వడంలో రాష్ట్రం టాప్‌లోకి చేరుకుంది.
మెటీరియల్ నిధుల్లో ముందు వరుసలో..
మొదటినుంచీ ఉపాధి పథకం వినియోగంలో ఏపీ ముందు వరుసలో ఉండేది. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో మెటీరియల్ కాంపోనెంట్ వినియోగంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. అనేక రకాల వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆ ఐదేళ్లలో సుమారు 120 అవార్డులు కైసవం చేసుకుంది. ఆ తర్వాత వైసీపీ హయాంలో అంతా రివర్స్ అయింది. మెటీరియల్ నిధులు దుర్వినియోగమయ్యాయి. ఉపాధి పథకంలో అనుమతి లేని పనులు ప్రారంభించడంతో కన్నెర్ర చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సచివాలయాల భవనాలు, జగనన్న కాలనీల్లో లెవలింగ్ పనులను నిలిపివేసింది. ఈ పనుల పేరుతో వైసీపీ కార్యకర్తలకు రూ.1,500 కోట్లు దోచిపెట్టినా అవి ఎక్కడా ఉపయోగపడలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెపండుగ 1.0 పేరుతో 4 వేల కి.మీ. సిమెంట్ రోడ్లతో పాటు 25వేల మినీ గోకులాలు నిర్మించారు. పల్లెపండుగ 2.0 కింద ఇప్పటికే 50శాతం సిమెంట్ రోడ్లు, మినీ గోకులాలను పూర్తి చేశారు. బుధవారం నాటికి రూ.1,884 కోట్ల మెటీరియల్ బిల్లులు అప్‌లోడ్ చేసి దేశంలోనే ఏపీ టాప్‌లో నిలిచింది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.