ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు!
ABN , Publish Date - Mar 22 , 2026 | 03:25 AM
ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం
2022 జనవరి 1 నుంచే వర్తింపు
10వేల మంది ఉద్యోగులకు లబ్ధి
జాబితాలో 4 సొసైటీలు.. 50కి పైగా కార్పొరేషన్లు
అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ ఉపసంఘంలో మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్, పి.నారాయణ సభ్యులుగా ఉన్నారు. జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీల్లోని ఉద్యోగులతో పాటు ప్రభుత్వ నిధులతో, సొంత నిధులతో నడుస్తున్న 50కి పైగా కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీవిరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని శనివారం నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో నిర్ణయించారు. ఈ నిర్ణయంతో దాదాపు 10వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే తమ పదవీ విరమణ వయసును కూడా 62 ఏళ్లకు పెంచాలని వీరు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై హైకోర్టులో దాదాపు 1,565 పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయమని, తాము జోక్యం చేసుకోబోమని ఈ ఏడాది జనవరిలో ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని పదవీ విరమణ వయసు పెంపుపై నిర్ణయం తీసుకుంది.
62 ఏళ్లు నిండకపోతే తిరిగి ఉద్యోగంలోకి
2022 జనవరి 1నుంచే రెట్రోస్పెక్టివ్‌గా ఈ పదవీ విరమణ వయసు పెంపును అమలు చేస్తారు. ఇప్పటికే రిటైరైపోయి 62 ఏళ్లు నిండిన ఉద్యోగులకు నోషనల్ ప్రయోజనాలు అందిస్తారు. దీంతో వారి పెన్షన్ పెరుగుతుంది. 62ఏళ్లు నిండని వారిని తిరిగి సర్వీసులోకి తీసుకుంటారు. రిటైరయి నెల రోజులే అవుతున్నా, 62 ఏళ్లు నిండడానికి కేవలం 3 నెలల సమయమే ఉన్నా సరే తిరిగి వారిని సర్వీసులోకి తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 4 ఫార్మ్ వర్సిటీల్లో అధ్యాపక సిబ్బంది పదవీ విరమణ వయసును 62 నుంచి 65కి పెంచాలన్న ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అవి ప్రస్తుతం సంబంధిత శాఖల్లోనే పెండింగ్‌లో ఉన్నాయి.
అప్పుడూ బాబే.. ఇప్పుడూ బాబే..
రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 ఏళ్లుగా ఉండేది. 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని 60 ఏళ్లకు పెంచారు. ఆ తర్వాత 2016లో సొసైటీలు, కార్పొరేషన్లు, యూనివర్సిటీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా ప్రభుత్వ సర్వీసు ఉద్యోగులతో సమానంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ 2022లో ఉత్తర్వులు ఇచ్చారు. ఇవి రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తాయని, ప్రభుత్వ రంగ సంస్థల్లోని కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలకు వర్తించవని పేర్కొంటూ మరో జీవో కూడా ఇచ్చారు. అప్పటికే జగన్ ముఖ్యమంత్రి అయి రెండున్నరేళ్లు అవుతుంది. ఆ రెండున్నరేళ్ల పాటు రిటైరైన ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వలేకపోయారు. ఈ భారాన్ని తప్పించుకునేందుకే ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును మాత్రమే పెంచారు. కార్పొరేషన్లు, సొసైటీలు చాలావరకు సొంత నిధులతో నడుస్తాయి. జీతాలు, ఇతర ప్రయోజనాలు ఆయా కార్పొరేషన్లు, సొసైటీల నుంచే అందుతాయి. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై ప్రభావం ఉండదు. అందుకే ఖజానాపై ప్రభావం పడే ప్రభుత్వ ఉద్యోగుల వయసును మాత్రం పెంచుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
హర్షం వ్యక్తం చేసిన ఏపీఎన్జీవో
ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయంపై ఏపీఎన్జీవో అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్ హర్షం వ్యక ్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న మంత్రుల బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.