ఇక రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లు
ABN , Publish Date - Jul 03 , 2026 | 04:17 AM
ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును ఇప్పటికే 62 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం.. పీఎస్‌యూలు , కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకూ ఇది వర్తింప చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పీఎస్‌యూలు, కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులకు వర్తింపు 2022 జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చేలా జీవో
అమరావతి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును ఇప్పటికే 62 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం.. పీఎస్‌యూలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకూ ఇది వర్తింప చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ విభజన చట్టం-2014లోని షెడ్యూల్ 9, 10 కింద ఉన్న సంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62కు పెంచుతూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది. 60 ఏళ్లు పూర్తయి ఇప్పటికే పదవీ విరమణ పొందిన ఉద్యోగులను 62 ఏళ్లు నిండే వరకు తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలి. దానికి అనుగుణంగా ఆయా సంస్థలు నిబంధనలు సవరించుకోవాలి. కోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పటికే 62 ఏళ్ల వరకు సర్వీసులో కొనసాగిన ఉద్యోగుల సేవలను పరిగణనలోకి తీసుకుని నిబంధనల ప్రకారం అన్ని పెన్షన్ ప్రయోజనాలు కల్పించాలి. 60 ఏళ్లకు పదవీ విరమణ పొందినవారు తిరిగి విధుల్లో చేరే వరకు ఉన్న మధ్యంతర కాలానికి ఎటువంటి జీతం చెల్లించరు. మధ్యంతర కాలాన్ని నోషనల్ బేసి్‌సపై వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్, సీనియారిటీ, ప్రమోషన్ల కోసం మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. తిరిగి విధుల్లోకి చేరిన తేదీ నుంచి మాత్రమే ఆర్థిక ప్రయోజనాలు అందిస్తారు. ఒకవేళ ఉద్యోగి రిటైర్డయి పెన్షన్ ప్రయోజనాలు పొంది ఉంటే వాటిని తిరిగి సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక 60 ఏళ్లకు పదవీ విరమణ పొంది తిరిగి చేరడానికి ఆసక్తి లేని వారికి 60 ఏళ్ల రిటైర్మెంట్‌కే అనుమతిస్తారు.