తెలంగాణ వైఖరితో నీటి వివాదాలు.. నీటి యుద్ధాలయ్యే ప్రమాదం
ABN , Publish Date - May 23 , 2026 | 05:31 AM
తెలంగాణ అనుసరిస్తున్న వైఖరితో తొలిసారిగా నీటి వివాదాలు కాస్తా.. నీటి యుద్ధాలుగా మారే ప్రమాదం నెలకొందని ఆంధ్రప్రదేశ్ తెలిపింది.
బ్రిజేశ్ ట్రైబ్యునల్ ఎదుట ఏపీ వాదనలు
అమరావతి, మే 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అనుసరిస్తున్న వైఖరితో తొలిసారిగా నీటి వివాదాలు కాస్తా.. నీటి యుద్ధాలుగా మారే ప్రమాదం నెలకొందని ఆంధ్రప్రదేశ్ తెలిపింది. నీటి హక్కుల కోసం పోరాటం పేరిట ఆ రాష్ట్రం ఆంధ్రలోని ప్రాజెక్టుల విధ్వంసానికి దిగుతోందని ఆక్షేపించింది. శుక్రవారం బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ ఎదుట ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా వాదనలు వినిపించారు. కృష్ణా నదిపై తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు, బ్యారేజీలు నిర్మిస్తోందన్నారు. మున్నేరు తదితర ప్రాజెక్టుల నిర్మాణంతో కృష్ణా డెల్టా సిస్టమ్ విచ్ఛిన్నమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్నేరు బేసిన్ నుంచి కృష్ణా డెల్టాకు రావలసిన 53 టీఎంసీలు రావన్నారు. పైగా తెలంగాణ ఆమోదయోగ్యం కాని పంట అవసరాల నీటి వినియోగ లెక్కలను ట్రైబ్యునల్ ముందుంచుతోందని అభ్యంతరం తెలిపారు.