కుమ్మేసిన వాన
ABN , Publish Date - Jun 15 , 2026 | 04:16 AM
రుతుపవనాల రాకతో రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురవగా, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో..
రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు
పొంగిపొర్లిన వాగులు, వంకలు
నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, చెట్లు
పలు గ్రామాలకు రాకపోకలు బంద్
సిక్కోలులో పిడుగుపాటుకు ఇద్దరు మృతి
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
రుతుపవనాల రాకతో రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురవగా, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆదివారం పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు చేరి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. మట్టిమిద్దెలు కూలిపోయాయి. కర్నూలు జిల్లా కోసిగిలో అత్యధికంగా 100.6 మిల్లీమీటర్లు, అనంతపురం జిల్లా రాప్తాడులో 100, కర్నూలు జిల్లా ఆలూరులో 90, నంద్యాల జిల్లా బేతంచర్లలో 77.2, హోలగుండ, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలోని బత్తలపల్లెలో 70, కర్నూలు జిల్లా దేవనబంద, శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లాలోని పలు గ్రామాలు, కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా సుమారు 40 విద్యుత్ స్తంభాలు, 120కి పైగా చెట్లు నేలకూలాయి. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం లింగాపురం గ్రామానికి చెందిన కొనారి యుగంధర్(19), మిర్తివలస గ్రామానికి చెందిన పాండ్రంకి రామినాయుడు (55) పిడుగుపాటుకు మృతి చెందారు. ఇదే జిల్లా డెంకాడ, నెల్లిమర్ల, గంట్యాడ మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. పార్వతీపురం మన్యం జిల్లాలో వీరఘట్టం మండలం చేబియ్యంవలస గ్రామానికి చెందిన ఏడుగురు మహిళలు చెరువులో ఉపాధి పనులు చేస్తుండగా సమీపంలో పిడుగుపడి అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని మక్కువ, సీతంపేట, వీరఘట్టం, గరుగుబిల్లి తదితర మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలాగే, శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం నగిరికటకం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం పిడుగుపడి ఐదు మేకలు, మూడు గొర్రెలు చనిపోయాయి.

నేడు కోస్తాంధ్ర అంతటా వర్షాలు..
కోస్తాలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. మధ్యాహ్నానికి పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. తునిలో 40.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే సమయంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కొనసాగిన ఉపరితలద్రోణి ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొని కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో ఎక్కువచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో ఈదురుగాలులు, పిడుగులతో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, కోస్తాలో వేడివాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల విస్తరణలో జాప్యం జరుగుతున్నదని, కోస్తాలో మిగిలిన ప్రాంతాలకు విస్తరించడానికి నాలుగైదు రోజుల సమయం పడుతుందని పేర్కొంది. సోమవారం మన్యం, అల్లూరి, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, బాపట్ల, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
ప్రకాశం బ్యారేజీకి వరద
విజయవాడ, జూన్ 14(ఆంధ్రజ్యోతి): ఎగువనున్న తెలంగాణలో శనివారం రాత్రి విస్తారంగా వర్షాలు కురవడంతో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం మొదలైంది. కీసర, మునేరు వాగుల నుంచి ప్రకాశం బ్యారేజీకి 2900 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో తూర్పు ప్రధాన కాల్వకు 2104, రైవస్ కాల్వకు 1501, కేఈబీ కెనాల్‌కు 303, బందరు కాల్వకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
