Share News

వర్షం.. కాస్త ఉపశమనం!

ABN , Publish Date - May 23 , 2026 | 04:48 AM

రాష్ట్రంలో ఓవైపు ఎండలు మండిపోతుండగా, పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.

వర్షం.. కాస్త ఉపశమనం!

  • నెల్లూరులో 7 డిగ్రీలు తగ్గిన ఉష్ణోగ్రత

  • ఉమ్మడి అనంతలో గాలివాన.. ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం

నెల్లూరు, అనంతపురం అర్బన్‌, విశాఖపట్నం, మే 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓవైపు ఎండలు మండిపోతుండగా, పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. నెల్లూరులో శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. గురువారం జిల్లా సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 44.1 డిగ్రీలు నమోదవగా శుక్రవారం 37.2 డిగ్రీలు నమోదైంది. అంటే ఒక్క రోజులో ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. జిల్లాలో అత్యధికంగా సైదాపురంలో 42.8 డిగ్రీలు నమోదైంది. అనేకచోట్ల ఈదురుగాలులకు విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. చెట్లు నేలకూలాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అనంతపురం నగరం జలమయమైంది. రోడ్లపై వర్షపునీరు నిలి చి, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఆత్మకూరు మండలంలో అత్యధికంగా 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీసత్యసాయి జిల్లాలోని మొత్తం 32 మండలాల్లో గురువారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినన వర్షం కురిసింది. అమరాపురం మండలంలో అత్యధికంగా 4.92 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పదును వర్షాలు కురవడంతో రైతులు ఖరీఫ్‌ సాగు పనులను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. కాగా, అనంతపురం జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు 104 మంది రైతులకు చెందిన 135.89 హెక్టార్లల్లో రూ.4.41 కోట్ల విలువైన ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.అరటి, బొప్పాయి, దానిమ్మ, టమాటా పంటలు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో భారీవృక్షాలు, స్తంభాలు నేలకొరిగాయి.


గాలుల తీవ్రత

ఉత్తరాంధ్రలోని ఎక్కువ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి పది గంటల వరకు ఈదురుగాలులు, పిడుగులతో వర్షం కురిసింది. ఉరుములు, పిడుగులు, గంటకు 60 నుంచి 70 కి.మీ. గాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. ఎండ తీవ్రతతో ఏర్పడిన వాతావరణ అనిశ్చితితో భారీ మేఘాలు ఏర్పడి పిడుగులు, ఈదురుగాలులు సంభవించాయని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం అధికారి ఒకరు తెలిపారు. వర్షం కంటే గాలుల తీవ్రత ఎక్కువగా ఉందన్నారు.

Updated Date - May 23 , 2026 | 04:49 AM