Share News

రబీ.. భళా!

ABN , Publish Date - Mar 22 , 2026 | 03:33 AM

రాష్ట్రంలో రబీ సాగు ఆశాజనకంగా ఉంది. లక్ష్యాన్ని మించి అధిక విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. 2025-26 రబీ సీజన్‌లో 20.79లక్షల హెక్టార్లలో 22 రకాల వ్యవసాయ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు.

రబీ.. భళా!

  • లక్ష్యాన్ని మించిన సాగు విస్తీర్ణం

  • సాగు అంచనా 20.79లక్షల హెక్టార్లు

  • సాగయ్యింది.. 27.36 లక్షల హెక్టార్లు

  • ఆశాజనకంగా పంట ఉత్పత్తులు

  • ప్రత్యామ్నాయ పంటలపై రైతుల దృష్టి

అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రబీ సాగు ఆశాజనకంగా ఉంది. లక్ష్యాన్ని మించి అధిక విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. 2025-26 రబీ సీజన్‌లో 20.79లక్షల హెక్టార్లలో 22 రకాల వ్యవసాయ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 27.36లక్షల హెక్టార్లలో ఆయా పంటలు సాగయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం 138ు విస్తీర్ణంలో పంటలు వేశారు. ఈ సీజన్‌లో (గత నవంబరులో) మొంథా, దిత్వా తుఫాన్లతో భారీ వర్షాలు కురిసినా.. రబీ పంటలకు చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టం జరగలేదు. భూమిలో తేమ, ఉపరితలంలో పొడి వాతావరణం, పంటలకు కలిసొచ్చాయి. ఇప్పటి వరకు ఉత్పత్తులు కూడా ఆశాజనకంగానే ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. వాస్తవంగా 2025 ఖరీ్‌ఫలో 31.21లక్షల హెక్టార్ల సాధారణ సాగులో 29.16లక్షల హెక్టార్లలోనే(93ు) పంటలు పడ్డాయి. కానీ 2025-26 రబీ సీజన్‌లో లక్ష్యాన్ని మించి 6.57లక్షల హెక్టార్లలో అదనంగా పంటలు సాగయ్యాయి. 2024-25 రబీలో కేవలం 18.51లక్షల హెక్టార్లలో పంటలు వేశారు.


ఇప్పుడు గతం కన్నా మిన్నగా రబీ సాగు కావడం విశేషం. ఈ సీజన్‌లో అత్యధికంగా దాళ్వా వరి 9.15లక్షల హెక్టార్లలో సాగైంది. జొన్న, మొక్కజొన్న, ఇతర చిరుధాన్యాల పంటలు 6.40లక్షల హెక్టార్లు, శనగ(బెంగాళీగ్రామ్‌) 4.11లక్షల హెక్టార్లతో కలిపి అపరాల పంటలు 9.15లక్షల హెక్టార్లు, వేరుశనగ, ఇతర నూనె గింజలు 1.35, పొగాకు 1.14 హెక్టార్లలో సాగయ్యాయి. కాలువల చివరి ప్రాంతాలతో సహా కృష్ణా, గోదావరి డెల్టాల్లో సాగునీరు సకాలంలో అందడంతో దాళ్వా వరి పుష్కలంగా పండింది. కొందరు రైతులు మొక్కజొన్న సాగు వైపు మొగ్గు చూపారు. కాగా అర్ధ గణాంక శాఖ జనవరి 12న విడుదల చేసిన రెండో ముందస్తు అంచనా ప్రకారం రబీలో వరి ధాన్యం హెక్టారుకు 7,078 కిలోలు, మొక్కజొన్న 8,319, జొన్న 3,755, శనగ 1,159, మినుము 1,229, వేరుశనగ 2,481, పొగాకు 2,275 కిలోలు దిగుబడి వస్తుందని దిగుబడి అంచనా వేశారు.

Updated Date - Mar 22 , 2026 | 03:34 AM