పీఎన్‌జీపై విస్తృత ప్రచారం: మంత్రి నాదెండ్ల
ABN , Publish Date - May 23 , 2026 | 06:41 AM
వంటగ్యాస్ కోసం వినియోగిస్తున్న ఎల్పీజీ సిలిండర్లకు ప్రత్యామ్నాయంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) వైపునకు వినియోగదారులను మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని...
అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): వంటగ్యాస్ కోసం వినియోగిస్తున్న ఎల్పీజీ సిలిండర్లకు ప్రత్యామ్నాయంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) వైపునకు వినియోగదారులను మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. దీనిపై గ్యాస్ కంపెనీలు ప్రజలకు పూర్తి అవగాహన కల్పించే దిశగా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. అన్ని జిల్లాల్లో ప్రచార జాతాలు నిర్వహించాలని కోరారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, పీఎన్‌జీ గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమీక్షించారు. రవాణా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. మనోహర్ మాట్లాడుతూ.. అన్నదానం జరిగే పెద్ద ఆలయాల్లో తప్పనిసరిగా పీఎన్‌జీనే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దుర్గ గుడి, శ్రీకాళహస్తి ఆలయాల్లో ఎదురవుతున్న చిన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని దేవదాయ కమిషనర్‌ను ఆదేశించారు. నగరాలు, పట్టణాల్లో గ్రూప్ హౌస్‌లు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ప్రత్యేక గృహ సముదాయాలకు పైప్డ్ గ్యాస్ సరఫరాను విస్తరించేందుకు కంపెనీలు కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. పీఎన్‌జీ గ్యాస్ విస్తరణలో యువతను భాగస్వామ్యం చేయాలన్నారు. స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రతి జిల్లా నుంచి 15 రోజులకొక బ్యాచ్‌లో 100 మందిని తీసుకుని శిక్షణ అందించాలన్నారు. డ్వాక్రా మహిళల ద్వారా పీఎన్‌జీ ఉపయోగాలను వివరించేలా అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని కోరారు.