ఉద్యాన రంగానికి ఊతమివ్వండి
ABN , Publish Date - May 06 , 2026 | 06:21 AM
రాష్ట్రంలో ఉద్యాన రంగాన్ని ప్రోత్సహించాలనే ప్రభుత్వ ఆలోచనలకు మద్దతుగా నిలవాలని బ్యాంకులు, నాబార్డు ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.
బ్యాంకులు, నాబార్డును కోరిన సీఎం
5.11 లక్షల కోట్లతో రుణ ప్రణాళిక
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉద్యాన రంగాన్ని ప్రోత్సహించాలనే ప్రభుత్వ ఆలోచనలకు మద్దతుగా నిలవాలని బ్యాంకులు, నాబార్డు ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఏడాదికి 450 లక్షల టన్నుల ఉద్యాన ఉత్పత్తులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మంగళవారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్(నాబార్డు) ‘క్రెడిట్ ప్లాన్ స్టేట్ ఫోక్‌స’ను సీఎం ఆవిష్కరించారు. 2026-27కు రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళికతో నాబార్డు రూపొందించిన అంచనా పత్రాన్ని ఆయన విడుదల చేశారు. దీనిలో సాగు రంగానికి రూ.2.55 లక్షల కోట్లు కేటాయించారు. దీనిలో.. పంట రుణాలకు రూ.1.66 లక్షల కోట్లు, పశుసంవర్ధక రూ.34,972 కోట్లు, మత్స్యశాఖకు రూ.21,098 కోట్లు,ఉద్యానశాఖకు రూ.11,961 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.8,265 కోట్లు ఇస్తారు. ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఉద్యాన వనాల అభివృద్ధికి రూ.5,313 కోట్లు, వ్యవసాయ మౌలి క సదుపాయాలకు రూ.9,957 కోట్లు, అనుబంధ కార్యకలాపాలకు రూ.12,687 కోట్లు కేటాయిస్తారు. ఎంఎస్ఎంఈలకు రూ.1.64 లక్షల కోట్లు ప్రతిపాదించారు. నాబార్డు సీజీఎం ఎమ్మార్ గోపాల్, జీఎంకేవీఎస్ ప్రసాద్, ఎస్‌ఎల్‌బీసీ, ఎస్బీఐ, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.