Share News

రాష్ట్రంలో 28న పల్స్‌ పోలియో

ABN , Publish Date - Jun 24 , 2026 | 05:46 AM

రాష్ట్రానికి ఉన్న పోలియో రహిత హోదా కొనసాగేలా ఈ నెల 28న జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో 28న పల్స్‌ పోలియో

అమరావతి, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి ఉన్న పోలియో రహిత హోదా కొనసాగేలా ఈ నెల 28న జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఐదేళ్లలోపు వయస్సు కలిగి ఉన్న 49,20,239 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో చివరి పోలియో కేసు 2008లో నమోదైంది. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ పోలియో రహిత రాష్ట్రంగా కొనసాగుతోంది. పల్స్‌ పోలియో కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 29,873 కేంద్రాల్లో పోలియో చుక్కలు వేస్తారు. వలస కుటుంబాలు, నిర్మాణ ప్రాంతాలు, ఇటుక బట్టీలు, సంచార జాతుల నివాస ప్రాంతాల్లోని చిన్నారులను చేరుకునేందుకు 1757 ప్రత్యేక బృందాలను నియమించారు. బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, జాతరలు, సంతలు, ప్రధాన రాకపోకల ప్రాంతాల కోసం 1144 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటింటికి వెళ్లేందుకు 59,746 బృందాలను ఆరోగ్య శాఖ సిద్ధం చేసింది. ఈ కార్యక్రమ నిర్వహణలో 1,31,298 మంది సిబ్బంది పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన 68,67,740 మోతాదుల పోలియో వ్యాక్సిన్‌ను ఇప్పటికే జిల్లాలకు తరలించారు.

Updated Date - Jun 24 , 2026 | 05:47 AM