పన్నుల ‘రిబేట్’తో పెరిగిన వసూళ్లు
ABN , Publish Date - May 07 , 2026 | 04:24 AM
రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను వసూళ్లలో తొలి నెలలోనే మంచి ప్రగతి సాధించాయి.
తొలినెలలోనే మున్సిపల్స్‌లో 35 శాతం
ఏప్రిల్ 30 నాటికి 948.15 కోట్లు వసూలు
స్పందించిన పట్టణ ప్రాంత ప్రజలు
అమరావతి, మే 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను వసూళ్లలో తొలి నెలలోనే మంచి ప్రగతి సాధించాయి. ఏప్రిల్ 30 నాటికి రూ.2683 కోట్లకు గాను రూ.948.15 కోట్లు వసూలు చేసి 35 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశాయి. బకాయిలు, జరిమానాలు కలిపి మొత్తం వసూళ్లు రూ.1010 కోట్లకు చేరాయి. ఏప్రిల్ 30లోపు ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5 శాతం రిబేట్ ప్రకటించడంతో పట్టణ ప్రజలు స్పందించారు. సరిగ్గా ఏడాది క్రితం ఈ సమయానికి రూ.771 కోట్లు వసూలైంది. దీంతో పోలిస్తే ఈ సారి రూ.176 కోట్ల పెరుగుదలతో 22.91 వృద్ధి నమోదైంది. మొత్తం వసూళ్లలోనూ 24.16 శాతం వృద్ధి కనిపించింది. జీఐఎస్ మ్యాపింగ్, డ్రోన్ సర్వేలు, డిజిటల్ డ్యాష్‌బోర్డులు, మొబైల్ యాప్‌లు పన్నుల వసూళ్ల పెరుగుదలకు ప్రధాన కారణమని అధికారులు వెల్లడించారు. 2025-26లో రూ.2556 కోట్లుగా ఉన్న డిమాండ్ 2026-27లో రూ.2683 కోట్లకు పెరగడం ద్వారా పన్ను పరిధి విస్తరించినట్లు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లలో కాకినాడ 43.28 శాతం, మంగళగిరి-తాడేపల్లి 41.21, గుంటూరు 40.79, రాజమండ్రి 40.41, కర్నూలు 39.59, విజయవాడ 39.21, విశాఖపట్నం 33.25 శాతం వసూళ్లతో ముందంజలో నిలిచాయి. పట్టణ స్థానికసంస్థల్లో అద్దంకి 51.56 శాతం వసూళ్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆత్మకూరు, ఉయ్యూరు, చీరాల, పిడుగురాళ్ల, తాడిగడప, గిద్దలూరు పట్టణాలు 40 శాతానికి పైగా వసూళ్లు సాధించాయి.
డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహం
పురమిత్ర, మనమిత్ర యాప్‌లు, ఆన్‌లైన్ గేట్‌వేలు, యూఎల్‌బీ కౌంటర్ల ద్వారా చెల్లింపులను సులభతరం చేశారు. ఏప్రిల్ 30 వరకు 5 శాతం రాయితీ ఇవ్వడం వల్ల ముందస్తు చెల్లింపులు పెరిగాయి. పట్టణ ఆస్తుల ఆటోమ్యుటేషన్ ద్వారా 13,938 దరఖాస్తులు అందగా, రూ.12.70 కోట్ల ఫీజు వసూలైంది. 12,043 మ్యుటేషన్లు పూర్తయ్యాయి. కొత్తగా గుర్తించిన వేలాది ఆస్తులను పన్నుల పరిధిలోకి అధికారులు తీసుకొచ్చారు. ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్ల బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఖాళీ స్థలాల పన్ను బకాయిదారులకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. భవిష్యత్తులో పట్టణ ఆస్తుల డేటా భద్రత, పారదర్శకత కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.