Share News

17 ఏళ్ల తర్వాత తండ్రి చావుపై రాజకీయాలా..!

ABN , Publish Date - May 23 , 2026 | 06:43 AM

జగన్‌ వ్యాఖ్యలపై వైసీపీ నేతలే నవ్వుతున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

17 ఏళ్ల తర్వాత తండ్రి చావుపై రాజకీయాలా..!

  • నాడు సీబీఐ నివేదికను ప్రశ్నించలేదేం?: సోమిరెడ్డి

అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): జగన్‌ వ్యాఖ్యలపై వైసీపీ నేతలే నవ్వుతున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వైఎస్‌ చనిపోయిన 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు చంద్రబాబును అనుమానిస్తూ జగన్‌ చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. సీబీఐ కూడా వైఎస్‌ మృతి ప్రమాదమని తేల్చింది. అప్పట్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలే ఉన్నాయి. అప్పుడు నోరు మెదపని జగన్‌ ఇప్పుడు దానిపై ఆరోపణలు చేయడం ఏమిటి? తండ్రి మరణంపై అనుమానాలు ఉంటే 2019లో అధికారంలోకి వచ్చినప్పుడైనా వాటిని నివృత్తి చేసుకోకుండా గాజులు తొడుక్కుని కూర్చున్నారా? జగన్‌ కుటుంబం చేసిన ఘోరాలు, నేరాలన్నీ నిన్న మీడియా సాక్షిగా కడపకు చెందిన పార్థసారథి రెడ్డి ఏకరవు పెట్టారు. వైఎస్‌ కుటుంబం చేసిన అన్ని ఘోరాలకు ప్రథమ సాక్షి ఆయనే. చంద్రబాబుకు ఫ్యాక్షన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. ఆయన చరిత్రలో నేరాలు లేవు. దీనిని జగన్‌ గుర్తు పెట్టుకోవాలి’ అని సోమిరెడ్డి అన్నారు.

తండ్రి చావునూ రాజకీయాలకు..: గొట్టిపాటి

తండ్రి చావునూ రాజకీయ ప్రయోజనాలకు జగన్‌ వాడుకోవడం దుర్మార్గమని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పేర్కొన్నారు. ‘ఐదేళ్లుగా సీఎంగా ఉండీ తండ్రి, బాబాయ్‌ హత్యపై అనుమానాలు ఎందుకు నివృత్తి చేసుకోలేదు? అధికారాన్ని అడ్డంపెట్టుకుని కక్షపూరిత రాజకీయాలకు పాల్పడ్డాడు. పదవి పోయేసరికి బీద ఏడుపులు ఏడుస్తున్నారు. ఇది జగన్‌కే చెల్లింది’ అని గొట్టిపాటి విమర్శించారు.

Updated Date - May 23 , 2026 | 06:45 AM