జగన్ రక్తచరిత్రకు మరో బీసీ బిడ్డ దస్తగిరి బలి
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:52 AM
హత్యలు చేయడం, సాక్షులను మాయం చేయడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. అధికారం కోసం జగన్ ఎంతటి దారుణానికైనా ఒడిగడతారని మరోసారి రుజువైంది...
హత్యలు, సాక్షుల మాయం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య: మంత్రి సవిత
అమరావతి, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): ‘హత్యలు చేయడం, సాక్షులను మాయం చేయడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. అధికారం కోసం జగన్ ఎంతటి దారుణానికైనా ఒడిగడతారని మరోసారి రుజువైంది’ అని మంత్రి సవిత అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘కడపలో హత్యకు గురైన వైసీపీ నాయకుడు పెద్ద దస్తగిరి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అక్రమాస్తులు కాపాడుకోవడానికి సొంత పార్టీకి చెందిన బడా నాయకులే దస్తగిరిని హతమార్చారు. జగన్ రక్త చరిత్ర రాజకీయాలకు మరో బీసీ బిడ్డ దస్తగిరి బలి అయ్యాడు. నమ్మిన వారినే బలి తీసుకోవడంలో జగన్‌ను మించిన వారు లేరు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశంతోనే ఈ హత్య జరిగిందనేది స్పష్టం. జగన్ మేనమామకు ప్యాలెస్ కట్టించి ఇచ్చినందుకే దస్తగిరిని హతమార్చినట్లు ఉంది. మహిళల పుసుపు కుంకుమలతో ఆడుకోవడం జగన్‌కి అలవాటుగా మారింది. వైసీపీ గుర్తు ఇప్పుడు ఫ్యాన్ కాదు... గొడ్డలి. దస్తగిరిని హత్య చేయించింది తానే కాబట్టి ఆ కుటుంబాన్ని చూసేందుకు జగన్‌కు ధైర్యం చాలడం లేదు. లేకపోతే... శవ రాజకీయాలు చేయడంలో ఆరితేరిన జగన్ సొంత పార్టీ నాయకుడు దస్తగిరి ప్రాణాలు పోతే మౌనంగా ఎందుకున్నారు?’ అని మంత్రి సవిత ప్రశ్నించారు.