నిరసన పేరిట.. వైసీపీ గూండాయిజం
ABN , Publish Date - Jun 13 , 2026 | 05:54 AM
కూటమి ప్రభుత్వ పాలనపై ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పలుచోట్ల గూండాయిజానికి దిగారు. టీడీపీ నాయకులపై దాడులు చేశారు.
పలు జిల్లాల్లో రెచ్చిపోయిన జగన్ మూక
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
కూటమి ప్రభుత్వ పాలనపై ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పలుచోట్ల గూండాయిజానికి దిగారు. టీడీపీ నాయకులపై దాడులు చేశారు. నేతల ఇళ్ల ముందుకు చేరి నిరసన పేరుతో హంగామా సృష్టించారు. దీంతో పలు జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతపురం జిల్లాలో ‘సర్’ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు వెళ్తున్న టీడీపీ కార్యకర్తల బస్సుపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. తమ వాహనాలను ఓవర్ టేక్ చేశారన్న కారణంతో కురుగుంట గ్రామం వద్ద అడ్డగించి బస్సుకు బైక్‌లు అడ్డుపెట్టి దౌర్జన్యానికి దిగారు. బస్సుపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేయడంతో టీడీపీ నాయకులకు గాయాలయ్యాయి. ఈ ఘటనను మంత్రి లోకేశ్ ఖండించారు. దాడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జగదీ్‌షకి ఆదేశాలు జారీ చేశారు.
తాడిపత్రిలో..
టీడీపీ, వైసీపీ శ్రేణుల ర్యాలీలతో అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కూటమి వచ్చి రెండేళ్లు పూర్తియిన సందర్భంగా ఎమ్మెల్యే జేసీ అశ్మిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీకి సిద్ధమయ్యారు. వైసీపీ వెన్నుపోటు నిరసనలో భాగంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీ తలపెట్టారు. వైసీపీ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డిని అదుపులో తీసుకుని అనంతపురం తరలించారు. మరోవైపు.. ‘పెద్దారెడ్డి ర్యాలీ ఎలా నిర్వహిస్తారని.. కోర్టును ధిక్కరిస్తారా?.’ అంటూ పెద్దారెడ్డి ఇంటివైపు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుచరులతో బయలుదేరారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే, పెద్దారెడ్డిపై కేసు నమోదు చేస్తేనే కదులుతానంటూ.. పెద్దారెడ్డి ఇంటి వద్దే రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు ఆయనకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. కానీ, పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపిస్తూ స్టేషన్ ఎదుట మంచంపై పడుకుని జేసీ నిరసన తెలిపారు. అక్కడే స్నానం చేశారు. సాయంత్రానికి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేయడంతో జేసీ వెళ్లిపోయారు.
మంత్రాలయంలో..
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో వైసీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ శ్రేణులు సంయమనం కోల్పోయారు. వైసీపీ నేతలపై దాడులు చేయడంతో పాటు రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. మంత్రాలయం నుంచి కోసిగి మండల కేంద్రానికి వైసీపీ ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి వందలాదిమంది అనుచరులతో బయలుదేశారు. మార్గమధ్యంలో మాధవరం గ్రామంలో టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి ఇంటి ఎదుట వైసీపీ అల్లరి మూకలు హంగామా చేశాయి. ఇంటి ఎదుట బైక్‌లతో చక్కర్లు కొట్టి, బాణసంచా పేల్చారు. రాఘవేంద్ర ఇంట్లో పనిచేసే సాల్మన్ వారించగా ఆయనపై దాడికి పాల్పడ్డారు. దీంతో టీడీపీ నేతలు కూడా దాడులకు దిగారు. వైసీపీ కార్యకర్త ఈరన్నపై దాడి చేసి, బైక్‌ను దహనం చేశారు. తుఫాన్ కారులో వచ్చిన వైసీపీ నేత శీనును అడ్డగించి, ఆ వాహనాన్ని కూడా తగులపెట్టారు. ఇరు పార్టీల నేతలపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.