ఏపీ పోలీసులకు పతకాల పంట
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:54 AM
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర హోంశాఖ ఆదివారం ప్రకటించిన శౌర్య, సేవా పతకాల్లో ఏపీ పోలీసులు పతకాల పంట పండించారు.
రాష్ట్రపతి మెడల్ సహా 19 సేవా పతకాలు
దేశవ్యాప్తంగా 982 మందికి శౌర్య, సేవా పతకాలు
న్యూఢిల్లీ, అమరావతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర హోంశాఖ ఆదివారం ప్రకటించిన శౌర్య, సేవా పతకాల్లో ఏపీ పోలీసులు పతకాల పంట పండించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒకరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకం రాగా, 15 మంది పోలీసులు, ముగ్గురు జైళ్లశాఖ అధికారులకు సేవా పతకాలు లభించాయి. దేశవ్యాప్తంగా పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డ్ అండ్ సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీ్‌సలకు చెందిన మొత్తం 982 మందికి హోంశాఖ శౌర్య, సేవా పతకాలు ప్రకటించింది. వారిలో 125 మందికి శౌర్య పతకాలు (గ్యాలెంట్రీ మెడల్స్), 101 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవాపతకాలు, 756 మందికి ప్రతిభా సేవా పతకాలు (మెడల్స్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) దక్కాయి.
డీఎస్పీ రవి మనోహరాచారికి రాష్ట్రపతి మెడల్
రాష్ట్రానికి చెందిన డీఎస్పీ రవి మనోహరాచారికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకం దక్కింది. పోలీస్ సర్వీస్ విభాగం కింద 15 మంది ప్రతిభా సేవా పతకాలకు ఎంపికయ్యారు. పోలీసుల్లో విక్రమరావు కామవరపు (ఎస్‌ఐ), కృష్ణమోహన్ సింగాల (అడిషనల్ ఎస్పీ), నరసింహరావు కుందేటి (సీఐ), శివరెడ్డి రాయపు (డీఎస్పీ), శ్రీనివాసరెడ్డి (ఏఎస్ఐ), రంగయ్య గల్లా (హెడ్‌కానిస్టేబుల్), జయరాం కటారి (ఆర్మ్‌డ్ ఎస్‌ఐ), గంగాధరరావు (ఏఎస్ఐ), నరసింహులు (హెడ్ కానిస్టేబుల్), వెంకటకృష్ణ మునీశ్వరరావు (ఆర్మ్‌డ్ ఎస్‌ఐ), అబ్రహాం అన్నాలదాసు (ఏఎ్‌సఐ), రామకృష్ణ కొప్పిశెట్టి (ఏఎ్‌సఐ), మల్లికార్జునరావు (అసిస్టెంట్ కమాండెంట్), షేక్ షఫీయుల్లా (ఎస్‌ఐ), రామారావు (అసిస్టెంట్ కమాండెంట్) ప్రతిభా సేవా పతకాలకు ఎంపికయ్యారు. జైళ్లశాఖ నుంచి రవిబాబు గొల్లపోతు (జైలర్), వెంకట కృష్ణప్రసాద్ (చీఫ్ హెడ్ వార్డర్), జి. ఆనందరావు (హెడ్ వార్డర్)కు ప్రతిభా సేవా పతకాలు లభించాయి. ఇది క్రమ శిక్షణ, వృత్తి నైపుణ్యం, ప్రజాసేవకు లభించిన గౌరవం అని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా అభిప్రాయపడ్డారు.
కేంద్ర సర్వీసుల్లోని తెలుగువారికీ గౌరవం
సీఆర్‌పీఎఫ్, సీబీఐ, బీఎస్ఎఫ్ వంటి కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్న తెలుగువారు కూడా పతకాలు దక్కించుకున్నారు. సీఆర్‌పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ కె.విశ్వనాథ్‌గౌడ్‌కు శౌర్య పతకం, సీబీఐ హెడ్‌కానిస్టేబుల్ రాముకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం, సీబీఐ జాయింట్ డైరక్టర్ వెంకట సుబ్బారెడ్డి, బీఎ్‌సఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ జయకుమార్, సీఐఎస్ఎఫ్ ఏఎఎస్ఐ వై.నాగేశ్వర్‌రావు, కేంద్ర హోంశాఖలో అసిస్టెంట్ డైరక్టర్ శైలేంద్రరావుకు ప్రతిభా సేవా పతకాలు లభించాయి. త్రివిధ దళాలలో పనిచేస్తున్న తెలుగువారు పతకాలకు ఎంపికయ్యారు. ఎయిర్‌మార్షల్ సీతేపల్లి శ్రీనివా్‌సకు పరమ్ విశిష్ఠ సేవా పతకం, వైస్ అడ్మిరల్ కుదరవల్లి శ్రీనివాస్, ఎయిర్ వైస్ మార్షల్ శెట్టిపల్లి శ్రీనివాసరావు, ఎయిర్ వైస్ మార్షల్ వాడపల్లి రవి సత్యనారాయణ రాజుకు అతి విశిష్ఠ సేవా పతకం, ఆర్మీ మేజర్ గుమ్మడి శ్రీనివా్‌సకు, నేవీ రేర్ అడ్మిరల్ శ్రీనివాస్, సరిహద్దు రహదారుల అభివృద్ధి బోర్డు సివిల్ ఇంజనీర్ ఆర్.శ్రీనివాసరావు విశిష్ఠ సేవా పతకాలను ప్రకటించారు.