ప్రతి ఇంటికీ తాగునీరు కోసం 17,394 కోట్లు
ABN , Publish Date - Jun 10 , 2026 | 05:05 AM
పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతోందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అన్నారు.
పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రణాళిక
ముందుగా ఐదు ప్రాథమిక అవసరాలపై దృష్టి
అర్బన్ చాలెంజ్ ఫండ్ కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షా్‌పలో మంత్రి నారాయణ
అమరావతి, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతోందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అన్నారు. విజయవాడలో మంగళవారం ఏర్పాటుచేసిన అర్బన్ చాలెంజ్ ఫండ్ కెపాసిటీ బిల్డింగ్ రెండు రోజుల వర్క్‌షాపును మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి కనెక్షన్ అందించేందుకు రూ.17,394 కోట్ల అంచనాతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా అమృత్ 1.0, అమృత్ 2.0, యూఐడీఎఫ్, ఏఐఐబీ పథకాల ద్వారా ఇప్పటికే రూ.12,395 కోట్ల విలువైన పనులు ప్రారంభమ య్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కచ్చా డ్రైన్లను శాశ్వత డ్రైన్లుగా మార్చేందుకు రూ.29 వేల కోట్లు అవసరమవుతాయి. కేంద్రం కేటాయించిన అర్బన్ క్లియరెన్స్ ఫండ్‌లో రాష్ట్రానికి లభించే రూ.3,600 కోట్లతో పాటు, రాష్ట్ర వాటాగా రూ.10,800 కోట్లను హడ్కో, ఇతర బ్యాంకుల ద్వారా సమీకరించేందుకు 72 మున్సిపాలిటీలకు రీపేమంట్ సామర్థ్యం ఉంది. మిగిలిన మున్సిపాలిటీల్లో రూ.5 వేల కోట్ల విలువైన పనులను యాన్యుటీ మోడల్ ద్వారా చేపట్టేందుకు ఆర్థిక శాఖ అనుమతి లభించింది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్లు పట్టణాల్లోని డ్రైన్లలో పూడికతీత పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. 3నెలల్లో డీపీఆర్‌లు సిద్ధం చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.. అని అధికారులను ఆదేశించారు.
ఏపీకి నమ్మకమైన అభివృద్ధి భాగస్వామిగా హడ్కో
హడ్కో చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ సంజయ్ కులశ్రేష్ఠ మాట్లాడుతూ.. హడ్కో రుణాలందించే సంస్థ మాత్రమే కాదని, ప్రాజెక్టుల గుర్తింపు, రూపకల్పన నుంచి పీపీపీ భాగస్వామ్యాల పర్యవేక్షణ వరకు ప్రతి దశలోనూ ఏపీకి ఒక నమ్మకమైన అభివృద్ధి భాగస్వామిగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం 25 శాతం గ్రాంట్ అందిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు వాటాను ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ మాట్లాడుతూ... మున్సిపాలిటీలు, మున్సిపల్ సేవలను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తొలిరోజు వర్క్‌షాపులో పైప్‌లైన్ ఆఫ్ బ్యాంకబుల్ ప్రాజెక్ట్స్, ప్రాజెక్టు రెవెన్యూ, బడ్జెట్ వ్యయం, డెబ్ట్ మేనేజ్‌మెంట్.. తదితర అంశాలపై హడ్కో అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరక్టర్ పి.సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.