Share News

కేంద్రం దృష్టికి రొయ్యల దాణా ధరల సమస్య

ABN , Publish Date - May 17 , 2026 | 05:30 AM

రొయ్యల దాణా ధరల విషయంలో ఆక్వా రైతులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

కేంద్రం దృష్టికి రొయ్యల దాణా ధరల సమస్య

  • మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): రొయ్యల దాణా ధరల విషయంలో ఆక్వా రైతులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమస్యపై రైతులు, దాణా తయారీ సంస్థలు, మత్స్యశాస్త్రవేత్తలు, అధికారులతో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ తాజాగా కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రొయ్యల సాగు, ఉత్పత్తి, దాణా ధరలు, వినియోగం, ధరల పెంపు వంటి అంశాలను మత్స్యశాఖ కమిషనర్‌ రాంశంకర్‌నాయక్‌ ప్రస్తావించారు. ప్రస్తుత ధరలనే కొనసాగించాలని రైతులు కోరగా... ముడిపదార్ధాల ధరల పెరుగుదలను సిబా శాస్త్రవేత్తలు వివరించారు. ఈ పెరుగుదల కారణంగా దాణా తయారీ వ్యయం సగటున కిలోకి రూ.31.03 వరకు పెరిగిందన్నారు. దాణా తయారీ సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ ముడిసరుకుల ధరలు 20శాతం పైగా పెరిగాయని, దీనివల్ల టన్ను దాణా తయారీకి రూ.25.15 అదనపు భారం పడుతోందన్నారు. రొయ్యల దాణా ధరను కిలోకు రూ.25 నుంచి రూ.31కు పెంచాల్సి ఉందని, లేకపోతే తయారీ యూనిట్లు కొనసాగించలేమని తెలిపారు. దీనిపై రైతు ప్రతినిధులు అభ్యంతరం తెలిపారు. ముడిపదార్ధాల ధరలు పెరిగినప్పుడు దాణా ధర పెంచుతున్న సంస్థలు, ధరలు తగ్గినప్పుడు.. ఆ ప్రయోజనాన్ని రైతులకు అందించడం లేదని వాపోయారు.

Updated Date - May 17 , 2026 | 05:32 AM