Share News

రాష్ట్రానికి ఎడ్యుకేషన్‌ సిటీ..!

ABN , Publish Date - Feb 10 , 2026 | 05:01 AM

విద్యారంగానికి రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక నగరం ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన ఐదు ఎడ్యుకేషన్‌ సిటీల్లో రాష్ట్రానికి ఒకటి వచ్చే పరిస్థితి ఉంది.

రాష్ట్రానికి  ఎడ్యుకేషన్‌ సిటీ..!

  • కేంద్రం ప్రకటించిన ఐదింటిలో ఒకటి సాధించేందుకు ప్రయత్నం

  • సీఎం ఆదేశాలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఉన్నత విద్యాశాఖ

అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): విద్యారంగానికి రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక నగరం ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన ఐదు ఎడ్యుకేషన్‌ సిటీల్లో రాష్ట్రానికి ఒకటి వచ్చే పరిస్థితి ఉంది. సీఎం ఆదేశాలతో ఉన్నత విద్యాశాఖ ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. 100-200 ఎకరాల్లో ఈ నగరాన్ని నిర్మిస్తారు. సాధారణ విద్యాసంస్థలకు ఇది భిన్నంగా ఉంటుంది. సాధారణ వర్సిటీలైతే వంద, రెండు వందల ఎకరాల్లో సొంతంగా ఏర్పాటవుతాయి. కానీ ఎడ్యుకేషన్‌ సిటీలో భవనం మినహా అన్నీ ఉమ్మడిగా ఉంటాయి. అడ్మిషన్లు తక్కువగా ఉండే అంతర్జాతీయ స్థాయి ప్రఖ్యాత వర్సిటీలను ఇందులోకి ఆహ్వానిస్తారు. నాలుగైదు ఎకరాల్లో వర్సిటీ భవనం నిర్మించుకునేలా భూమి కేటాయిస్తారు. క్రీడా మైదానాలు, హాస్టళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కామన్‌గా అందుబాటులోకి తెస్తారు. అన్ని ప్రముఖ వర్సిటీలు ఒకేచోట ఉంటే సమీప ప్రాంతంలో ఎడ్యుకేషన్‌ ఎకో సిస్టమ్‌ పెరుగుతుందనేది ఆలోచన. ఉమ్మడి పరిశోధనలకూ అవకాశం ఏర్పడుతుంది. ఈ సిటీలో స్కిల్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తారు. వీటిలో హైటెక్‌ ల్యాబ్స్‌, మోడ్రన్‌ కాలేజీలు, పరిశోధనా కేంద్రాలు, ఇన్నోవేషన్‌ హబ్‌లు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో అమరావతి లేదా విశాఖపట్నంలో ఈ సిటీ ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదిస్తోంది. ప్రతిపాదనల తయారీలో ఉన్నత విద్యాశాఖ నీతి ఆయోగ్‌ సహకారం తీసుకుంటోంది.

Updated Date - Feb 10 , 2026 | 05:01 AM